న్యూఢిల్లీ: కేరళలోని తిరువనంతపురంలో గల అనంతపద్మనాభ స్వామి ఆలయంలోని ఆరో నేలమాళిగపై ఉత్కంఠ తొలగడం లేదు. దాన్ని తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు తెరవకూడదని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ట్రావంకోర్ మాజీ రాకుమారుడు రాజా మార్తాండ వర్మ వేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు ఆర్‌వి రవీంద్రన్, ఎకె పట్నాయక్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. భారీ సంపద వెలుగు చూసిన నేపథ్యంలో ఆలయ పవిత్రతపై, భద్రతపై ప్రభుత్వం సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడింది.
ఆరో నేలమాళిగను తెరిచే విషయంపై విచారణను వచ్చే గురువారానికి కోర్టు వాయిదా వేసింది.ఆలయం ప్రజల ఆస్తి అని, దానిపై రాచకుటుంబం హక్కును గానీ యాజమాన్యాన్ని గానీ కోరడం లేదని మాజీ రాకుమారుడి తరఫున వాదిస్తున్న కెకె వేణుగోపాల్ చెప్పారు. ఆ సంపదంతా అనంత పద్మనాభ స్వామికి చెందిందని ఆయన తన వాదనలో భాగంగా చెప్పారు. ఆలయం వెలుపల, లోపల భారీ భద్రతను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.