హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మళ్లీ శాసనసభలో తీర్మానం పెట్టాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానించడం ఓ కుట్ర అని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గురువారం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఇందిరా పార్కు వద్ద చేపట్టిన 48 గంటల దీక్షలో భాగంగా ఆయన మాట్లాడారు. తెలంగాణపై అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం ప్రవేశ పెట్టామని గుర్తు చేశారు. మళ్లీ తీర్మానం అనడం ఓ కుట్ర అన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటించకుంటే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసు మనుగడ కష్టమని చెప్పారు. నాలుగు కోట్ల ప్రజల మనోభావాలకు అనుగుణంగా వెంటనే తెలంగాణను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి తెలంగాణ కోసం లేఖ రాసినప్పుడు, అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు, 2004, 2009 ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్రం ఇస్తామనే నినాదంతో ఎన్నికలలోకి వెళ్లినప్పుడు చెప్పని అభ్యంతరం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎందుకు చెబుతున్నారని ఆయన ప్రశ్నించారు.