హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పొన్నం వర్సెస్ పయ్యావుల, రెచ్చిపోయి తిట్లు

By B N Sharma
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav-Ponnam Prabhakar
హైదరాబాద్: మీరంతా కలిసి ఉండాల్సినవారు. పరస్పర దూషణలు వద్దు. ఉద్రేకాలు పెంచుకోవద్దు. తెలుగు వారి మధ్య సంఘర్షణ వాతావరణం మంచిది కాదు... అని ఢిల్లీ పెద్దలు హితవు పలికి ఒక్క రోజు కూడా గడవలేదు. మన నాయకులు మరింత రెచ్చిపోయారు. 'కలిసి వుంటే కలదు సుఖం" అని సూక్తిని పఠించే సీమాంధ్రనేతలు, 'అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసి ఉందాం" అని నినదించే తెలంగాణ నేతలు నోరు జారారు. నెత్తుటి మాటలు మాట్లాడారు. చావడాలు, చంపడాలు వరకు వెళ్ళారు. అసలే, అనిశ్చితిగా ఉన్న పరిస్ధితిని ఉద్రిక్తంగా, ఉద్రేకంగా మార్చారు. 'మా దేహం ముక్కలైనా రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వం. కేంద్రం లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు సైతం దిగుతాం" అంటూ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గుంటూరులో జరిగిన సీమాంధ్ర టీడీపీ నేతల సభలో ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలలో జరిపిన దీక్షా వేదికలపై కాంగ్రెస్ నేతలు వాడి వేడి ప్రసంగాలు చేశారు. కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ సీమాంధ్ర నేతలపై నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దంటూనే, ఒకవేళ, ఆ ఆలోచన ఉంటే, తెలంగాణకు అడ్డుపడుతున్న సీమాంధ్రులు కీర్తి శేషులుగా మిగులుతారని కూడా తెలిపారు. భగత్ సింగ్‌‌‌ని గుర్తు చేశారు. భగత్ సింగ్ ఎదుటవాడిని చంపాలనుకున్నాడు కానీ, తాను చావాలనుకోలేదని పొన్నం పేర్కొన్నారు. పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంత టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు.

సీమాంధ్రనేతల అసలు రంగు బయటపడిందని, వారు రక్తం రుచి మరిగిన పులులని మండిపడ్డారు. తెలంగాణకు అడ్డుపడితే మీ వ్యాపార ప్రయోజనాలను అడ్డుకుంటాం అని తెలంగాణ జేఏసీ అద్యక్షుడు కోదండరాం గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా ఇలాంటి పిలుపునే ఇచ్చారు. సీమాంధ్ర కాంట్రాక్టర్ల పనులు కదలకుండా అడ్డుకోవాలని సూచించారు. 'డిసెంబర్ 9" ప్రకటనపై కేంద్ర మంత్రి ప్రణబ్ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలపైనా తెలంగాణ నేతలు దుమ్మెత్తి పోశారు. ఈ రకంగా రాష్ట్రంలో వేడి వేడి ప్రసంగాలతో ఉద్రిక్త పరిస్ధితులేర్పడుతుండటంతో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

రోజు రోజుకు పేలుతున్న నేతల మాటల తూటాలు, ముఖాముఖి ఢీకొనేందుకు సిద్ధమవుతున్న ఉద్యోగ వర్గాలు - సర్కారు, సకల జన సమ్మె మొదలైనవన్ని రాష్ట్రంలో ఆగస్టు సంక్షోభాన్ని తెచ్చేలా వున్నాయి. ఇదిలా వుండగా, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ప్రాంతాల వారీ చర్చలను ముమ్మరం చేసింది. సీమాంధ్ర నేతల యాత్ర ముగిసిన వెంటనే, తెలంగాణ నేతల ఢిల్లీ పర్యటన మొదలైంది.

English summary
Though the Centre suggested the leaders to have patience and wait for some time till the decisions are announced. Leaders of Telangana and Andhra Regions are bursting with their hot speeches and are going to the extent of threatening their opponents. It is felt by many that the month August would see lot of crisis in the State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X