కరీంనగర్: తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితమైన వైఖరి అధికారికంగా ప్రకటిస్తేనే తెలంగాణ తెచ్చే బాధ్యత తమది అవుతుందని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ శుక్రవారం అన్నారు. ముందు టిడిపిలో ఏకాభిప్రాయం రావాలని సూచించారు. ఆ తర్వాతే కాంగ్రెసు బాధ్యత అవుతుందన్నారు. వారిలో ఏకాభిప్రాయం వచ్చాక తెలంగాణ రాకపోతే మమ్మల్ని ప్రశ్నించాలని చెప్పారు. ఇప్పటికీ తాము తెలంగాణ కోసం అధిష్టానంతో పోరాటం చేస్తున్నామన్నారు. తెలంగాణపై 2011 మహానాడు తీర్మానానికి కట్టుబడి ఉన్నామన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలపై తెలంగాణ టిడిపి నేతలు, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చామని చెబుతున్న టిడిపి ఇప్పటి యనమల వ్యాఖ్యలను ఏవిధంగా అర్థం చేసుకోమంటారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా టిడిపి ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు. తెలంగాణలోని అన్ని ఐక్య కార్యాచరణ సమితిలు కలిసి టిడిపిపై ఒత్తిడి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూలంగా మరోసారి చంద్రబాబుతో కేంద్రానికి లేఖ ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామాలు ఉపసంహరించుకోవాలని అధిష్టానం నుండి ఎలాంటి ఒత్తిడి తమపై లేదన్నారు. రాజీనామాలపై, భవిష్యత్తు కార్యాచరణపై స్టీరింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.