రాసలీలల కథనం, అంబటిని వెనకేసుకొస్తున్న జగన్

అంబటి రాంబాబు రాసలీలల కథనాన్ని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి కట్టుకథగా చూపించడానికి వివిధ ప్రముఖుల గొంతును అనుకరించడానికి ఎలా వీలవుతుందో, వేరువేరు చోట్ల మాట్లాడిన విషయాలను ఒక్క చోట చేర్చి నకిలీ టేపును తయారు చేయడానికి ఎలా వీలుంటుందో వివరిస్తూ సాక్షి టీవీ చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ తెరచాటున ఉండి మాట్లాడిన మంజు అంబటి రాంబాబు వైపు తన విధేయతను మార్చింది. ఆమె మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం వంటి విషయాలను సాక్షి దినపత్రిక ప్రచురిస్తోంది. మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా విభాగం నేతలు విశాఖపట్నంలో ఆందోళనకు దిగారు. దీన్నిబట్టి కూడా అంబటికి వైయస్ జగన్ మద్దతిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
అంబటి రాంబాబుకు తోడుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గట్టు రామచందర్ రావును, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని వైయస్ జగన్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అంబటికి తోడుగా నిలుస్తూ వారిద్దరు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై విమర్శలు చేస్తున్నారు. అంబటి రాంబాబును వైయస్ జగన్ వెనకేసుకు రావడానికి గల కారణాలపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఎబిఎన్ ఆంధ్రజ్యోతితో బద్ధ వైరం ఉండడాన్ని ఒక కారణంగా చూపుతుండగా, అంబటి రాంబాబుపై చర్యలు తీసుకుంటే తన ప్రత్యర్థులు మరింత రెచ్చిపోయి తన పార్టీకి తీవ్ర నష్టం కలగజేసే అవకాశాలున్నాయని జగన్ భావిస్తున్నారని మరో కారణం చూపుతున్నారు.












Click it and Unblock the Notifications