ధర్నాలో ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైయస్ జగన్

రైతులకు కనీవినీ ఎరుగని విధంగా వైయస్సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రైతులకు ఉచిత కరెంట్ ఇస్తూ ఫైల్‌పై మొదటి సంతకం చేశారని, అప్పులను మాఫీ చేశారని, ఆ సువర్ణ యుగాన్ని ప్రతి రైతూ గుర్తుకు తెచ్చుకుంటాడని ఆయన అన్నారు. వైయస్సార్ హయాంలో రైతుల కోసం అమలు చేసిన వివిధ కార్యక్రమాలను ఆయన వివరించారు. ముఖ్యమంత్రి అంటే అధికారి కాదని, మానవతావాది అని, ప్రతి ఒక్కరి గుండెచప్పుడు వినగలిగి ఉండాలని వైయస్ నమ్మారని ఆయన అన్నారు. వైయస్సార్ మరణించిన తర్వాత రైతుల కష్టాలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. రైతుల పంటలకు ప్రభుత్వం ధరలు పెంచడం లేదని ఆయన విమర్శించారు. పంచదార ధర పెరిగినా చెరుకు ధర పెరగలేదని, ప్రభుత్వం కంపెనీలతో కుమ్మక్కయిందని ఆయన అన్నారు.
ప్రభుత్వం మీద నమ్మకం లేక క్రాప్ హాలిడే పేరుతో సమ్మెకు దిగిన చరిత్ర మన రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ లేదని, దేశ చరిత్రలో కూడా లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆయన సూచించారు. రైతు దెబ్బ తింటే రాష్ట్రానికి అరిష్టం పడుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రైతుల పంటను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వరి వేసుకోవడం కన్నా ఉరి వేసుకోవడం మేలని రైతు అనుకుంటున్నాడని ఆయన అన్నారు. బ్యాంకు రుణాలు చెల్లించడం లేదంటూ దొంగల ఫొటోలను పోలీసు స్టేషన్లలో పెట్టినట్లుగా రైతుల ఫోటోలను పెడుతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. స్వామినాథన్ నివేదిక సూచనలను అమలు చేసే వరకు రైతులకు బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నమ్మినా నమ్మకపోయినా ఈ రాష్ట్రంలో సువర్ణయుగం వస్తుందని దేవుడిపై నమ్మకంతో చెబుతున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications