బాన్సువాడ పోలింగ్ ప్రారంభం, ఓటేసిన పోచారం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున పోచారం శ్రీనివాస రెడ్డి, కాంగ్రెసు తరఫున శ్రీనివాస గౌడ్ పోటీ చేస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. గురువారం ఉదయం నుచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ప్రజలు ఓటు వినియోగించుకునేందుకు 186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రాల్లో తొలిసారిగా వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోచారం శ్రీనివాస రెడ్డి గురువారం ఉదయమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ అంశంపైనే ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏరాటు అయ్యే వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే వైఖరిలో భాగంగా తెలుగుదేశం పార్టీ బాన్సువాడ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టలేదు. పోచారం శ్రీనివాస రెడ్డి విజయంపై ధీమాతో ఉన్నారు.












Click it and Unblock the Notifications