బొత్సకు సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎర్త్ పెడతారా?

మంత్రివర్గంలో తనదంటూ ఓ జట్టు లేకపోవడం కిరణ్ కుమార్ రెడ్డికి లోపంగా కనిపిస్తోంది. అదే సమయంలో జోడు పదవులతో బొత్స సత్యనారాయణ కిరణ్ కుమార్ రెడ్డిపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకరికి ఒకే పదవి అంటూ బొత్స సత్యనారాయణను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ తెలంగాణ ఆర్టీసి కార్మికుల సమ్మె విరమణలో కీలక పాత్ర పోషించి, ఆ క్రెడిట్ ముఖ్యమంత్రికి దక్కకుండా చేశారు. తెలంగాణ సకల జనుల సమ్మె విరమణకు అనువైన ప్రకటనను కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో తానే ఇప్పించానని ఆయన ప్రచారం చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ స్థితిలో బొత్స సత్యనారాయణ గండాన్ని తప్పించుకోవడానికి ఆయన అధిష్టానం వద్ద ఒకరికి ఒకే పదవి అనే వాదనను ముందుకు తేవచ్చునని చెబుతున్నారు.
అయితే, బొత్స సత్యనారాయణ గండాన్ని తప్పించుకున్నా ఎమ్మెల్సీగా ఎన్నికైన డి. శ్రీనివాస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డికి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. మంత్రివర్గంలో డిఎస్‌కు ప్రత్యేకంగా స్థానం కల్పించాల్సి ఉంటుంది. బహుశా, హోంశాఖను ఆయనకు అప్పగించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ స్థితిలో డిఎస్ రూపంలో మరో పవర్ సెంటర్ తయారై కిరణ్ కుమార్ రెడ్డికి చిక్కులు తెచ్చి పెట్టే అవకాశాలే ఉన్నాయి. ఇదే సమయంలో ఆంధ్ర కాపులు, తెలంగాణ బిసిలు ఒక్కటవుతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. కాంగ్రెసులో ఈ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా డిఎస్, బొత్స, చిరంజీవి కలిసి పనిచేస్తూ కిరణ్ కుమార్ రెడ్డికి చిక్కులు తెచ్చి పెడతారనే అభిప్రాయం కూడా ఉంది. ఈ గండాన్ని గట్టెక్కడానికి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో తన జట్టును ఏర్పాటు చేసుకునే ఎత్తుగడలో ఉన్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications