వైయస్ జగన్ వర్గం శానససభ్యుల్లో గుబులు

రాజీనామాలను పరిష్కరించే విషయంలో స్పీకర్ ఓ పద్ధతిని అనుసరిస్తున్నట్లు అర్థమవుతోంది. పార్టీలకు కూడా రాజీనామా చేసిన శాసనసభ్యులపై ఆయన మొదట దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. నాగం జనార్దన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి శాసనసభా సభ్యత్వాలకే కాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేశారు. తదనంతరం స్పీకర్ ఆహ్వానాన్ని అందుకున్న శాసనసభ్యులు కూడా పార్టీకి రాజీనామా చేసినవారే. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు తమ ఎమ్మెల్యే పదవులకు మాత్రమే కాకుండా కాంగ్రెసు పార్టీకి కూడా రాజీనామా చేశారు. దీంతో తమ రాజీనామాలు ఆమోదం పొందుతాయనే భయం వారిని పీడిస్తున్నట్లు చెబుతున్నారు.
కొంత మంది శాసనసభ్యులు సోమవారం స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించవద్దని కోరినట్లు సమాచారం. పది నుంచి 12 మంది శాసనసభ్యులు తిరిగి కాంగ్రెసులోకి రావడానికి ప్రయత్నాలు ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. ఆళ్ల నాని పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమానికి స్వయంగా ఏర్పాట్లు చేశారు. అందుకు ఆయన ముఖ్యమంత్రిని కూడా కలిశారు. వైయస్ జగన్ వ్యవహార శైలి నచ్చక, రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనతో తిరిగి వారు కాంగ్రెసులోకి రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications