న్యూఢిల్లీ: అవినీతి కుంభకోణంలో జైలుపాలైన బిపి ఆచార్య మళ్లీ పోస్టింగ్‌తో హోం శాఖ కార్యదర్శి అవుతారని తెలుసుకుని ప్రజలు నవ్వుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు ఆదివారం వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. ఆచార్యకు మళ్లీ పోస్టింగ్ లభిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. సామాన్యులకు ఒక న్యాయం, ఐఏఎస్‌లకు మరొక న్యాయం పాటించటం సరికాదన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్‌లకు మళ్లీ పోస్టింగ్ ఇవ్వకుండా కేంద్రానికి ముఖ్యమంత్రి లేఖ రాయాలని సూచించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదుల నిర్లక్ష్యం వల్లే జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ అక్రమాస్తులపై సిబిఐ విచారణ జరుపుతోందని, సంబంధిత జీవోలను కూడా అది పరిశీలిస్తున్నందున ప్రత్యేకంగా మరో విచారణ అవసరం లేదన్న వాదనను న్యాయవాదులు వినిపించి ఉంటే ఇలా జరిగేది కాదన్నారు.
కార్పొరేట్, రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు కట్టబెట్టే సంస్థగా విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ మారిందని విమర్శించారు. నిందితుల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసి పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖలో స్థలాలు పొందిన ఐటీ సంస్థలు విప్రో, సత్యంలు ఇంత వరకూ కార్యకలాపాలను ప్రారంభించనందున ఆ స్థలాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీని నమ్ముకొని, కష్టపడి పని చేసే నిజమైన కార్యకర్తలకు కాంగ్రెసు పార్టీ తప్పనిసరిగా ప్రాధాన్యం ఇస్తుందని మరోసారి నిరూపితమైందన్నారు. సోనియా గాంధీ పార్టీ కోసం పని చేసే వారు ఎక్కడున్నా గుర్తించి పదవుల్లో అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ చిరంజీవికి రాజ్యసభ అవకాశం కల్పించారని చెప్పారు. వాగ్ధాటి కలిగిన మహిళా నాయకురాలు రేణుకా చౌదరికి అవకాశం కల్పించడం పార్టీకి రాజ్యసభలో, వెలుపల కూడా ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు.