చిరుకు సపోర్ట్‌చేసిన చదలవాడకు టిడిపి తిరుపతి టికెట్

ఇంటి ఇలవేల్పు శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకొని ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి వచ్చినట్లు చెప్పారు. టిడిపి ఆనవాయితీలో భాగంగానే తిరుపతి నుండి ప్రచారం చేసేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. గత ఏడు సంవత్సరాలుగా దేశంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందన్నారు. అవినీతి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.
నాస్తికులను తితిదే పాలకమండలి అధ్యక్షులు, సభ్యులుగా నియమించడం వల్ల పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కిందిస్థాయి నాయకత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ అల్లర్లకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు.
అనంతరం ఆయన 2003లో అలిపిరిలో తనపై మావోయిస్టులు దాడి చేసిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వేంకటేశ్వర స్వామికి బట్టలు ఇవ్వాల్సిన సమయంలో తనపై దాడి జరిగిందని, ఆ స్వామి వారి దయ వల్లనే తాను బతికి బయట పడ్డానని చెప్పారు. శ్రీవారి దయతో బయట పడ్డ తనకు ఆది పునర్జన్మ అన్నారు. కాకతాళీయంగా జరిగినా ఇది ఎప్పటికీ గుర్తుండి పోయే సంఘటన అన్నారు.
అవినీతిపై పోరాడి ధర్మాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా చదలవాడను టిడిపి అభ్యర్థిగా ప్రకటించారు. కాగా చదలవాడ 2009 సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెసులో ఉన్నారు. అయితే ఆయన కాంగ్రెసు పార్టీలో ఉంటూనే అప్పటి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత కాంగ్రెసు నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గెలుపు కోసం కృషి చేశారనే ఆరోపణలున్నాయి.
నాస్తికులకు వైయస్ రాజశేఖర రెడ్డి తిరుమల తిరపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ పదవులు కట్టబెట్టారని, వారు దేవుడి నగలను కరిగించారని, డాలర్లు దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. వారందరూ కలిసి దేవుడి సొమ్మును దిగమింగారని ఆయన అన్నారు. తిరుపతి పక్కనే భూకబ్జాలకు పాల్పడ్డారని, టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కుటుంబానికి వైయస్ పదవులు కట్టబెట్టారని ఆయన అన్నారు. వైయస్ హయాంలో తిరుపతిని అప్రతిష్టపాలు చేశారని ఆయన అన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా చేపట్టామని ఆయన చెప్పారు.
కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు కిరాయి ఇళ్లలాంటివని, తెలుగుదేశం సొంత ఇల్లు లాంటిదని ఆయన అన్నారు. తమ పార్టీని వీడిపోయినవారు తిరిగి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్ల కాంగ్రెసు పాలన రాష్ట్రానికి శాపంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ చేతకాని తనం వల్లనే మతఘర్షణలు జరుగుతున్నాయని చంద్రబాబు విమర్శించారు. సర్వీస్ టాక్స్ ప్రజలకు పెను భారంగా మారిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications