వైయస్ జగన్‌ కట్టడికి సోనియా గాంధీ ప్లాన్

Sonia Gandhi-YS Jagan
న్యూఢిల్లీ: రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దూకుడుకు కళ్లెం వేయడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తగిన ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెబుతన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని కాపాడుకోవడానికి ఆమె ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక్కటి - వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఎవరినీ వదిలిపెట్టకూడదనేది. రెండోది - పార్టీ ఐక్యతను దెబ్బ తీస్తున్న పార్టీ నాయకులను దారిలో పెట్టడం

వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దూకుడు పెంచిన విషయం అర్థమవుతూనే ఉంది. ఈ కేసులో మంత్రులను గానీ ప్రభుత్వాధికారులను గానీ ఎవరినీ వదలకూడదని సిబిఐకి స్పష్టమైన సూచన అందినట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం సిబిఐ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండానే ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. అసంతృప్తి పార్టీ నేతలను దారికి తెచ్చే పనిని సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకైనా పార్టీ నాయకులు అసమ్మతి గళం విప్పకుండా చూడాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

సోనియా ప్లాన్‌లో భాగంగా అహ్మద్ పటేల్ అసమ్మతి నాయకులకు ఫోన్లు చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. దాంతో డిఎల్ రవీంద్రా రెడ్డి, రాయపాటి సాంబశివ రావు, గల్లా అరుణ కుమారి, గండ్ర వెంకటరమణా రెడ్డి, సి రామచంద్రయ్య, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వంటి మంత్రులు, నాయకులు దారిలోకి వచ్చినట్లు చెబుతున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెనక నడవడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు. ముఖ్యమంత్రికి తన విధేయతను కూడా ప్రకటించారు. వాయలార్ రవి ఎప్పటికప్పుడు పార్టీ నాయకుల తీరును పరిశీలిస్తూ పర్యవేక్షిస్తున్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై సిబిఐ మరింత మంది మంత్రులను, పారిశ్రామికవేత్తలను, ప్రభుత్వాధికారులను పిలిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వైయస్ హయాంలోని వ్యవహారాలు తీగ లాగితే డొంక కదిలినట్లు ఉందని అంటున్నారు. దీంతో ఏ మేరకు తాము వెళ్లాలనే విషయంపై సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పనితీరు పట్ల సోనియా గాంధీ అంత సంతృప్తిగా లేనప్పటికీ పార్టీని రాష్టంలో కాపాడే విషయంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు చెబుతున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి పార్టీని గాడిలో పెట్టడమే లక్ష్యంగా ఆమె వ్యూహరచన అమలుకు నాయకులను నియోగించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+