రాష్ట్రపతి పోటీకి అబ్దుల్ కలాం నో: ఎన్డీయే ఆశలపై నీళ్లు

రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు అబ్దుల్ కలాంపై తృణమూల్, బిజెపిలు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో ఆయన ఈ రోజు స్వయంగా ప్రకటన చేశారు. తన పట్ల నమ్మకం ఉంచినందుకు వారికి కృతజ్ఞతలు అని చెప్పారు. బిజెపి తరఫున ఆ పార్టీ నేత సుధీంద్ర కులకర్ణి ఈ రోజు రెండుసార్లు కలాంను కలిసి ఒప్పించేందుకు ప్రయత్నించారు. అద్వానీ కూడా కలాంకు ఫోన్ చేసి ఒప్పించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారు.
మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై చర్చించేందుకు బిజెపి కోర్ కమిటీ రాత్రి తొమ్మిది గంటలకు సమావేశం కానుంది. ఇప్పటి వరకు అబ్దుల్ కలాంపై వారు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన పోటీకి నిరాకరించడంతో మరొకరిని వెతుక్కోవాల్సి ఉంది. మొదట పిఎ సంగ్మాను బలపర్చాలని భావించినప్పటికీ శివసేన తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆయన అభ్యర్థిత్వంపై వెనక్కి తగ్గారు.
మమతా బెనర్జీ కూడా తృణమూల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో సాయంత్రం భేటీ కానున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై పార్టీ విధానాన్ని ఆమె ఈ సమావేశంలో వివరించే అవకాశముందని తెలుస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి మమత మొదటి నుండి కలాంను ప్రతిపాదిస్తోంది. ఆయన నిరాకరించడంతో ఇప్పుడు ఆమె పిఏ సంగ్మా వైపు మొగ్గు చూపే అవకాశముంది.












Click it and Unblock the Notifications