భర్తల కోసం భార్యల ధర్నా, కొండాపూర్‌లో ఉద్రిక్తత

తమను వీడియోలో చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్న ఓ పోలీసును ఎపిఎస్పీ కానిస్టేబుళ్ల భార్యలు చితకబాదారు. వారు తీవ్ర ఆగ్రహంతో అతనిపై విరుచుకుపడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్నా సెలవులు ఇవ్వకుండా తమ భర్తలను కమాండెంట్ వేధిస్తున్నారని వారు ఆరోపించారు. గత నెల తూర్పు గోదావరి జిల్లాకు విధులకు వెళ్లిన ఫణికుమార్ అనారోగ్యంతో మరణించాడు. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయకుండా పోస్టుమార్టం నిర్వహించకుండా అతని శవాన్ని స్వస్థలానికి తరలించారని వారు ఆరోపిస్తున్నారు.
ఫణికుమార్ సంఘటన నేపథ్యంలో కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనకు దిగారు. దాదాపు వేయి మంది భార్యలు కొండాపూర్ కార్యాలయం గేటు వద్ద ఆందోళనకు దిగారు. కమాండెంట్ వెంకటేశ్వర రావు తమ భర్తలను వేధిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. వెంకటేశ్వర రావును బదిలీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎపిఎస్పీ 8వ బెటాలియన్ పోలీసు కానిస్టేబుళ్ల భార్యలు తమ పిల్లలతో, తమ కుటుంబ సభ్యులతో వారు ధర్నాకు దిగారు.
హైదరాబాదులోని మాదాపూర్ పోలీసులు ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఎపిఎస్పీ కానిస్టేబుళ్ల సమస్యలను పరిష్కరిస్తామని హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. సంఘటనపై నివేదిక ఇవ్వాలని ఆమె ఐజి వెంకటేశ్వర్లును ఆదేశించారు. ఆందోళనను విరమించుకోవాలని ఆమె ఎపిఎస్పీ కానిస్టేబుళ్ల భార్యలకు ఆమె విజ్ఞప్తి చేశారు. కానిస్టేబుళ్ల భార్యలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications