ధర్మాన రాజీనామా ఆమోదానికే అధిష్టానం మొగ్గు

శుక్రవారం ఆయన సోనియా, ప్రధాని మన్మోహన్‌లను కలుసుకోనున్నారు. ధర్మాన రాజీనామా వ్యవహారంపై పార్టీ పెద్దలందరికీ కిరణ్ వివరణ ఇచ్చారు. "మంత్రులు ఆరోపణలు ఎదుర్కోవటం ఒక ఎత్తు. విచారణ సంస్థ ఏకంగా అభియోగాలు నమోదు చేయడం ఒక ఎత్తు. ధర్మాన రాజీనామా చేయటాన్ని పార్టీ, ప్రభుత్వం స్వాగతించాలి'' అని కోర్ కమిటీ సభ్యులు అభిప్రాయపడినట్లు తెలిసింది.
అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రిని కూడా కేబినెట్‌లో కొనసాగిస్తే, అవినీతి ప్రభుత్వం అన్న ముద్ర పడుతుందని, అలా జరగటం పార్టీకి కూడా మంచిది కాదని వారు కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ధర్మాన రాజీనామాను ఆమోదించాలని ఆజాద్, అహ్మద్ పటేల్ ముఖ్యమంత్రికి చెప్పినట్లు సమాచారం.
ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని చెప్పగా... "జగన్ అక్రమాస్తుల కేసులో మొత్తం ఆరుగురు మంత్రులపై ఆరోపణలు ఉన్నాయి. ఒకరి రాజీనామాను ఆమోదిస్తే మిగిలిన వారినీ తప్పించాల్సి వస్తుంది. పైగా, వీరిలో ఎక్కువమంది బలహీన వర్గాలు, దళిత వర్గానికి చెందిన వారున్నారు. వీరిని తప్పిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి. ఆయా జిల్లాల్లో బలమైన ఈ నేతలను తొలగిస్తే సంస్థాగతంగా కూడా నష్టం జరుగుతుంది'' అని కిరణ్ వివరణ ఇచ్చారు. ఈ మీమాంస తొలగించుకునేందుకే తాను సలహా తీసుకుంటున్నానని చెప్పారు.
ధర్మాన రాజీనామాను ఆమోదించకూడదన్న డిమాండ్‌తో ఎనిమిది మంది మంత్రులు సమావేశం కావడంపైనా ఆజాద్ ఆరా తీసినట్లు సమాచారం. ఇలా చేయటం వల్ల ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా ఆత్మరక్షణలో పడుతుందని చెప్పినట్లు తెలిసింది. అయితే, వైయస్ హయాంలో అంతా ముఖ్యమంత్రి మాటే నెగ్గేదని, ఆయన కొడుకు దోచుకున్న దానికి తామెందుకు బలి కావాలన్నదే మంత్రుల ఆవేదన అని సీఎం ఆజాద్‌కు తెలిపారు.
సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అర్ధరాత్రి పూట పిలిచి పలు విషయాలపై మాట్లాడారు. కిరణ్ కుమార్ రెడ్డిని కూడా మార్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అయితే, ఆయన స్థానంలో ఎవరిని నియమించాలనేది తేలడం లేదు. శుక్రవారం రాత్రి కేంద్ర మంత్రి ఆంటోనీ హైదరాబాద్ శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డితో మాట్లాడారు.












Click it and Unblock the Notifications