బిజెపి తెలంగాణ మార్చ్ ఉద్రిక్తం: టియర్‌గ్యాస్, లాఠీఛార్జ్

భారీ సంఖ్యలో కార్యకర్తలు ప్రధాని నివాసానికి మార్చ్‌గా బయలుదేరారు. వారిని జంతర్ మంతర్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. మహిళా కార్యకర్తలను పోలీసులు అక్కడ నుండి పంపించే ప్రయత్నాలు చేశారు. కార్యకర్తలు పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్స్‌ను తొలగిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేయడంతో పోలీసులు వాటర్ క్యానన్, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. దీంతో పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.
తాము ప్రశాంతంగా ప్రధాని ఇంటికి మార్చ్ నిర్వహిస్తుంటే పోలీసులు తమను అడ్డుకునే ప్రయత్నాలు చేశారని, నాలుగు కోట్ల తెలంగాణ మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెసు పట్టించుకోవడం లేదని, తాము ఈ రోజు తప్పకుండా ప్రధాని నివాసాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కార్యకర్తలు మొదటి, రెండో లెవల్ బ్యారీకేడ్స్‌ను తొలగించి ప్రధాని ఇంటి వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన కార్యకర్తలకు ఢిల్లీ బిజెపి కార్యకర్తలు అండగా నిలిచారు. ఈ తెలంగాణ మార్చ్ ప్రకాశ్ జవదేకర్ ఆధ్వర్యంలో జరిగింది. కాగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సాధారణ ప్రజలు అందరూ రాష్ట్రం రెండుగా విడిపోవాలని చూస్తున్నారని, కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెసు నాయకులే విభజనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితితో ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలిసి ఉద్యమిస్తామన్నారు.
అంతకుముందు వెంకయ్యనాయుడు.. కిషన్ రెడ్డి దీక్ష వేదిక వద్ద మాట్లాడారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసుకు ఇంకెంత సమయం కావాలని ప్రశ్నించారు. తెలంగాణ సమస్య పరిష్కారంలో కాంగ్రెసు అనుసరిస్తున్న వైఖరి సరికాదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెసు మోసం చేసిందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications