తెలంగాణ నేతలపై బాబు ఫైర్: సీమాంధ్రకు బుజ్జగింపు

తెలంగాణపై లేఖ ఇవ్వడానికి సీమాంధ్ర నాయకుల అభిప్రాయ సేకరణను చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. సీమాంధ్ర సీనియర్ నాయకులు కోడెల శివప్రసాదరావు, యనమల రామకృష్ణుడు,కాలువ శ్రీనివాస్,సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కె.ఇ.కృష్ణమూర్తి చంద్రబాబుకు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సీమాంధ్ర నాయకులంతా తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబుకు స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయనకు సూచించారు.
డిసెంబర్ తొమ్మిదిన కేంద్రం తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయాన్ని ప్రకటించగానే తామంతా సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో ఉద్యమించామని, ప్రజలు రోడ్డుమీదకు వచ్చి ఉద్యమించారని, ఇప్పుడు ఎవరు అడుగుతున్నారని లేఖ ఇవ్వాలనుకుంటున్నారని కె.ఇ. కృష్ణమూర్తి, సోమిరెడ్డి తదితరులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితుల్లో లేఖ ఇవ్వడం వల్ల సీమాంధ్రలో పార్టీ నష్టపోతుందని అన్నారు. లేఖ వల్ల పార్టీకి కలిగే ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ అని నాయకులు తెలిపారు.
ఇదే సమయంలో ‘లేఖ ఇవ్వనున్నట్టు మీరు సూచన ప్రాయంగా వెల్లడించారు.తెలంగాణ టిడిపి నాయకులు సైతం మీరు లేఖ ఇస్తున్నట్టు పదే పదే ప్రకటనలు చేశారు.ఇప్పుడు లేఖ ఇవ్వకపోతే పార్టీకి మరింత నష్టం'అని వారు అన్నట్టు తెలిసింది. వీరి వాదన విన్న చంద్రబాబు ‘ అందుకే మీ అందరి అభిప్రాయాలను కోరుతున్నాను. వాటి ప్రాతిపదికగానే లేఖపై నిర్ణయం తీసుకుంటాను'అని బదులిచ్చారు. ఈ అంశంపై మంగళ, బుధవారాల్లో పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తానని ఆయన వెల్లడించారు.
కాగా, తెలంగాణపై లేఖ ఇవ్వాలని చంద్రబాబు ముందుగానే నిర్ణయం తీసుకున్నారని, ఈ దశలో అభిప్రాయ సేకరణ వల్ల ప్రయోజనం ఏమిటని ఓ సీనియర్ నాయకుడు ప్రశ్నించారు. కేవలం తెలంగాణ గురించే కాకుండా సీమాంధ్ర ప్రయోజనాలను కూడా లేఖలో ప్రస్తావించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీని వల్ల తెలుగుదేశం పార్టీ రెండు ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, రెండు ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తోందనే సందేశం జనంలోకి వెళుతుందని వారు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications