మార్చ్ ఎఫెక్ట్: విఐపిలకు హైసెక్యూరిటీ, రెండ్రోజులు..

మార్చ్‌లో విధ్వంసం జరగవచ్చుననే ఇంటెలిజెన్స్ అనుమానాల నేపథ్యంలో జీవ వైవిధ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వివిఐపిలకు, సీమాంధ్ర నేతల ఇళ్లు, కార్యాలయాల వద్ద ప్రభుత్వం కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. కేంద్ర బలగాలను మోహరించారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 180కి పైగా దేశాల నుండి ప్రతినిధులు వస్తున్నారు. అనుకోని సంఘటన జరిగితే హైదరాబాద్‌తో పాటు భారత్ ఇమేజ్ దెబ్బ తింటుంది.
అందుకే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వివిఐపిలకు హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఐబి కూడా రాష్ట్ర పోలీసులకు ఆ దిశలో సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. అవసరమైన పక్షంలో విదేశీ ప్రతినిధులకు ఒక్కొక్కరికి ఒక్కో బాడీగార్డ్‌ను కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ఐబి పోలీసులను అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, తాజా పరిణామాలపై పోలీసులకు ఐబి తెలిపిందట. మార్చ్‌ను అడ్డు పెట్టుకొని ఉగ్రవాదులు కూడా పెట్రేగిపోయే అవకాశాలను కొట్టి పారేయలేమని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి.
ఆ రెండ్రోజులు...
ఈ నెల 29 గణేష్ నిమజ్జనం, 30న మార్చ్ నేపథ్యంలో సచివాలయాన్ని ఆ రెండ్రోజుల పాటు మూసివేయనున్నారు. అసెంబ్లీ, సచివాలయం తదితర వాటి పైన ఆందోళనకారులు దాడులు చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆ రోజు సచివాలయాన్ని మూసివేస్తున్నారు. సిఎంవో ఈ రెండ్రోజులు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు వద్ద నుండి విధులు నిర్వర్తిస్తుంది.
ఇప్పటికే ఆయా ప్రాంతాలలో బారీగా పోలీసులను మోహరించారు. కేంద్ర బలగాలను కూడా తరలిస్తున్నారు. సీమాంధ్ర నేతల ఇళ్ల వద్ద, కార్యాలయాల వద్ద ప్రభుత్వం భద్రత పెంచనుంది. అసెంబ్లీ, సచివాలయం చుట్టూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications