'సత్యభామ' వేదాంతం సత్యనారాయణ శర్మ ఇక లేరు

సత్యనారాయణ శర్మ కొద్ది రోజులుగా అస్వస్థతతో విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే గురువారం అర్ధరాత్రి తుది శ్వాసను వీడటంతో, ఆయన మృతదేహాన్ని మొవ్వ మండలం కూచిపూడికి తరలించారు. సత్యనారాయణ శర్మ కడసారి చూపు కోసం అశేషంగా అభిమానులు తరలి వచ్చారు.
కూచిపూడి నాట్యకళకు ఆయన ప్రతినిధిగా నిలిచారు. కూచిపూడికి పుట్టినిల్లయిన కూచిపూడి ఆగ్రహారంలో ఆయన 1934లో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయన నాట్యకళలో విశేషంగా ప్రతిభ కనబరుస్తూ వచ్చారు. 12వ యేటనే హరిశ్చంద్ర నృత్యనాటకంలో మాతంగ కన్యగా తొలిసారి స్త్రీ పాత్రను పోషించారు. అప్పటి నుంచి వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.
వేదాందం సత్యనారాయణ శర్మ మృతికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కూచిపూడి నాట్య కళాకారుడిగా వేదాంతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, మన్ననలు పొందారని ముఖ్యమంత్రి అన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ వేదాంతం మృతికి సంతాపం ప్రకటించారు.
వేదాంతం అంత్యక్రియలకు ప్రభుత్వ ప్రతినిధిగా పామర్రు ఎమ్మెల్యే డివై దాస్, అధికార ప్రతినిధిగా బందరు ఆర్డీవో ఐ వెంకటేశ్వరరెడ్డి వేదాంతం భౌతికకాయంపై పుష్పగుచ్చాలు ఉంచి గౌరవ వందనం చేశారు. అవనిగడ్డ డిఎస్పీ కె చాముండేశ్వరి, రిజర్వ్‌డ్ డిఎస్పీ బి చంద్రకుమార్, ఎస్‌ఐ గోపీకృష్ణ గాలిలోకి మూడు రౌండ్లు తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు.
అనంతరం ఆయన కుమారుడు పద్మశ్రీ వేదాంతం చితికి నిప్పంటించి అంతిమ సంస్కారం పూర్తిచేశారు. వైకెడి ప్రసాదరావు, పసుమర్తి కేశవప్రసాద్, భాగవతుల సేతురాం, వేదాంతం వెంకట నాగ చలపతి, తాడేపల్లి సత్యనారాయణ శర్మ, వైఎస్సార్సీపీ పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పులేటి కల్పన, రాజులపాటి మురళి, మద్దాల కామేశ్వరరావు తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications