సీఐ నాగరాజుకు ఉరిశిక్ష తప్పదా? కేరళ ఉదయకుమార్ కేసులో ఏం జరిగింది?
న్యాయాన్ని పరిరక్షించాల్సిన పోలీస్ స్టేషన్ ప్రాంగణమే ఒక మృత్యువుగా మారిపోతుంది. రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే కాలయముళ్లై విరుచుకుపడితే, ఆ నరకయాతన వర్ణించనలవి కానిది. ఇటీవల విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతం మానవత్వానికే పెద్ద మచ్చగా నిలిచింది.
కస్టడీలో విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టి చంపేయడమే కాకుండా, ఆ శవాన్ని అర్ధరాత్రి వేళ బైక్‌పై శ్మశానానికి తరలించి కాల్చేయడం.. పోలీసుల పైశాచికత్వానికి, నేరపూరిత మనస్తత్వానికి అద్దం పడుతోంది. కస్టోడియల్ టార్చర్ అనేది.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం పౌరుడికి ప్రసాదించిన "జీవించే హక్కు"పై జరిగిన దాడి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ తరహా కస్టడీ హత్యలు, బాధ్యులైన అధికారులకు న్యాయస్థానాలు విధించిన ఉరిశిక్షల వరకు చట్టం ముందు ఎవరూ అతీతులు కారనే నిజాలు స్పష్టమవుతున్నాయి.

రాత్రికి రాత్రే సాక్ష్యాల దహనం.. సిట్ రిమాండ్ రిపోర్టులో దిగ్భ్రాంతికర కోణాలు!
కృష్ణలంక కస్టోడియల్ డెత్ కేసులో సిట్ (SIT) అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టు విస్తుపోయేలా చేస్తోంది. ఈ ఏడాది మే 7న కృష్ణలంక స్టేషన్‌లో సీఐ నాగరాజు (ఏ1), హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానిలతో కలిసి సాయికృష్ణను నిర్బంధించి దారుణంగా కొట్టారు. మే 12 నాటికి సాయికృష్ణ పరిస్థితి అత్యంత విషమంగా మారింది. విషయం బయటకు పొక్కితే ప్రమాదమని భావించిన పోలీసులు, అతడిని రాణిగారితోటలోని ఒక ఖాళీ బిల్డింగ్ కు తీసుకెళ్లారు. కాసేపటికే సాయికృష్ణ ప్రాణాలు విడిచాడు.
సాయికృష్ణ చనిపోయాడని తెలియగానే సీఐ నాగరాజు ఆదేశాలతో అర్ధరాత్రి 12:30 గంటలకు మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, బైక్‌పై 'స్వర్గపురి' శ్మశానవాటికకు తీసుకెళ్లి 16వ నంబరు సిమెంట్ ప్లాట్‌ఫామ్‌పై తగలబెట్టారు. ఆ తర్వాత డిజిటల్ సాక్ష్యాలు, ఫోటోలను డిలీట్ చేసి, మృతుడి కుటుంబాన్ని బెదిరిస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని రాయబారాలు నడిపారు.
కేరళ ఉదయకుమార్ కేస్ (2005) - ఇద్దరు పోలీసులకు మరణశిక్ష
తిరువనంతపురంలో దొంగతనం అనుమానంతో అదుపులోకి తీసుకున్న 21 ఏళ్ల ఉదయకుమార్‌ను ప్రైవేట్ పార్టులు, తొడలు, వీపు మీద ఐరన్ రాడ్లతో కొట్టారు. విచారణలో పెట్టిన నరకయాతన వల్ల రక్తనాళాలు పగిలి, అదే రోజు రాత్రి ఆసుపత్రికి తరలించేసరికే ఉదయకుమార్ మృతి చెందాడు. సాక్ష్యాలను మాయం చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఉదయకుమార్ తల్లి ప్రభావతి.. కొడుకు న్యాయం కోసం సుదీర్ఘ న్యాయపోరాటం చేసింది. ఆమె పిటిషన్ ఆధారంగానే కేసు సీబీఐ (CBI)కి బదిలీ అయింది.
2018 జూలై 25న తిరువనంతపురం సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసును "అత్యంత అరుదైనది" గా పేర్కొంది. నిందితులైన ఎస్సై కె. జితకుమార్, కానిస్టేబుల్ ఎస్.వి. శ్రీకుమార్‌లకు ఉరిశిక్ష విధించింది. లాకప్ డెత్ కేసులో పోలీసులకు ఉరిశిక్ష పడటం దేశంలో సంచలనం సృష్టించింది. కుట్ర పన్ని, సాక్ష్యాలను ధ్వంసం చేసిన మిగతా ముగ్గురు పోలీసు అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును పోలీసులు ఆశ్రయించగా.. సీబీఐ దర్యాప్తులో అనేక తీవ్రమైన చట్టపరమైన లోపాలు ఉన్నాయని, సాక్షుల విచారణ సరైన పద్ధతిలో జరగలేదని పేర్కొంటూ.. శిక్ష పడిన పోలీసులందరినీ నిరపరాధులుగా తేలుస్తూ విడుదల చేసింది.
పూణే కస్టడీ డెత్ కేస్
విచారణ పేరుతో కస్టడీలో ఉన్న వ్యక్తిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి ప్రాణాలు తీసి, సాక్ష్యాలు మాయం చేసేందుకు యత్నించిన ఐదుగురు పోలీసు సిబ్బందికి ముంబై హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు.. వ్యవస్థ మారాల్సిన అవసరం!
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదికల ప్రకారం దేశంలో ప్రతి ఏటా సగటున 80 నుంచి 100 వరకు కస్టడీ మరణాలు రికార్డు అవుతున్నాయి. వీటిలో వెలుగులోకి వచ్చేవి కేవలం 2% మాత్రమే. కేసు కోర్టు వరకు వెళ్లినా.. తోటి సిబ్బంది సాక్ష్యాలను మాయం చేయడం వల్ల నిందితులైన పోలీసులకు శిక్షలు పడే శాతం చాలా అంటే చాలా తక్కువగా ఉంటోంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆదేశాల ప్రకారం బాధితులకు ఇచ్చే నష్టపరిహారాన్ని తప్పు చేసిన పోలీసు అధికారుల జీతాలు, పెన్షన్ల నుంచి రికవరీ చేయాలని స్పష్టం చేసింది.
కృష్ణలంక ఘటనలో సిట్ అధికారులు సేకరించిన ఎముకలు, బూడిద, సిసిటీవీ దృశ్యాలు ఎంత కీలకమో.. రాబోయే రోజుల్లో న్యాయస్థానం ఇచ్చే తీర్పు కూడా అంతే కీలకం. కేరళ ఉదయకుమార్ కేసు తరహాలోనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అమాయకుల ప్రాణాలు తీసే అధికారులకు కఠిన శిక్షలు పడినప్పుడే, లాకప్‌లలో ప్రాణాలు గాల్లో కలవకుండా ఆగుతాయి.














Click it and Unblock the Notifications
