చైనాకు కోలుకోలేని దెబ్బ. రూ.10,000 కోట్లతో కేంద్రం స్కీమ్..
దేశంలో సౌర విద్యుత్ రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. సోలార్ ప్యానెళ్ల తయారీలో అత్యంత కీలకమైన 'పాలీసిలికాన్' ముడిసరుకును మన దేశంలోనే తయారు చేయడానికి ఏకంగా రూ.7,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల భారీ నిధులతో కొత్త పథకానికి రూపకల్పన చేస్తోంది. ఇప్పటివరకు సోలార్ ప్లేట్లు, సెల్స్ తయారీలో వేగంగా పురోగతి సాధించిన భారత్.. ముడిసరుకు కోసం మాత్రం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ బలహీనతను అధిగమించి, దేశీయంగా కనీసం 10 గిగావాట్ల పాలీసిలికాన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈ కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
సౌర విద్యుత్ ప్యానెళ్ల తయారీలో పాలీసిలికాన్ అత్యంత ప్రధానమైన ద్రవ్యం. సిలికాన్‌ను అత్యంత శుద్ధి చేసి తయారుచేసే ఈ ముడిసరుకుతోనే 'ఇన్గాట్స్', 'వేఫర్స్' తయారుచేసి, వాటి నుంచి సోలార్ సెల్స్, మోడ్యూల్స్ ఉత్పత్తి చేస్తారు. మన దేశంలో ప్రస్తుతం 228 గిగావాట్ల సోలార్ మోడ్యూల్స్, 31 గిగావాట్ల సెల్స్ తయారుచేసే సామర్థ్యం ఉంది. మన అవసరాలకు మించి ఇక్కడ ప్రాసెస్ జరుగుతున్నప్పటికీ, అసలైన పాలీసిలికాన్ కోసం మాత్రం మనం చైనాపైనే పూర్తిగా ఆధారపడుతున్నామని నీతి ఆయోగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆధారపడే తత్వాన్ని తుడిచేసి, 2030 నాటికి దేశంలో 30 గిగావాట్ల పాలీసిలికాన్ సామర్థ్యాన్ని నెలకొల్పాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది.

అదే పెద్ద సవాలు.. అందుకే ప్రత్యేక పథకం!
సోలార్ సెల్స్, మోడ్యూల్స్ తయారు చేయడం కంటే పాలీసిలికాన్ ఉత్పత్తి అత్యంత సంక్లిష్టమైనది, ఖర్చుతో కూడుకున్నది. కేవలం ఒక గిగావాట్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంట్ పెట్టాలన్నా దాదాపు రూ.2,500 కోట్ల పెట్టుబడి అవసరమవుతుంది. అంతేకాకుండా, ఇది తీవ్రమైన కెమికల్ ప్రాసెస్ కావడంతో విద్యుత్, నీటి వినియోగం ఊహించని స్థాయిలో ఉంటుంది. ఒక్క కేజీ పాలీసిలికాన్ తయారు చేయాలంటే సుమారు 80 లీటర్ల నీరు, 57 యూనిట్ల విద్యుత్ అవసరం. ఇది మన దేశంలోని ఒక సాధారణ కుటుంబం 18 రోజుల పాటు వాడే కరెంట్‌తో సమానం. గతంలో పీఎల్ఐ (PLI) పథకంలో దీనికి కొంత నిధులు కేటాయించినా, ఖర్చు ఎక్కువగా ఉండటంతో ఆశించిన పురోగతి లభించలేదు. దీంతో ఈ రంగానికి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
దిగ్గజ సంస్థలతో చర్చలు.. ప్రధాని కార్యాలయానికి ప్రతిపాదనలు
సాధారణ సోలార్ కంపెనీల కంటే కెమికల్ మాన్యుఫ్యాక్చరింగ్ అనుభవం ఉన్న కంపెనీలైతేనే ఈ పాలీసిలికాన్ ప్లాంట్లను సమర్థవంతంగా నిర్వహించగలవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదిత్య బిర్లా గ్రూప్, టాటా కెమికల్స్ వంటి ప్రముఖ దిగ్గజ సంస్థలతో మంత్రిత్వ శాఖ ఇప్పటికే చర్చలు జరిపింది. ఇతర శాఖల నుంచి వచ్చిన సూచనలతో ఈ పథకానికి తుది మెరుగులు దిద్దిన అధికారులు, త్వరలోనే కేబినెట్ ఆమోదం కోసం పంపనున్నారు. 2030 నాటికి దేశంలో 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలన్న భారత లక్ష్యానికి ఈ పాలీసిలికాన్ పథకం అత్యంత కీలకంగా మారనుంది.














Click it and Unblock the Notifications
