సాగరాలు దాటిన భారత కీర్తి: స్వీడన్ ఎంపీగా గెలిచిన బీజేపీ మంత్రి మేనకోడలి కథేంటి?
మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా బలమైన ముద్ర వేసిన ఆ కుటుంబ వారసురాలు ఒకరు.. అంతర్జాతీయ రాజకీయ చిత్రపటంపై సరికొత్త చరిత్ర సృష్టించారు. సాగరతీరాలను దాటి స్వీడన్ పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించారు. గ్రీన్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆమె.. ఎంపీగా ఎన్నికయ్యారు. భారత కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. ఈ విజయంతో స్వీడన్ లో ప్రభుత్వ మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంటోంది.
ఆమె.. నీలా విఖే పాటిల్. మహారాష్ట్రతో విడదీయరాని అనుబంధం ఉంది. ప్రముఖ విద్యావేత్త అశోక్ విఖే పాటిల్ కుమార్తె. కేంద్ర మాజీమంత్రి బాలసాహెబ్ విఖే పాటిల్ మనవరాలు. ప్రస్తుత మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్.. ఆమెకు బాబాయ్ అవుతారు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సహకార చక్కెర కర్మాగారాన్ని స్థాపించి దేశంలో ఓ నూతన విప్లవానికి నాంది పలికిన పద్మశ్రీ విఠల్‌రావ్ విఖే పాటిల్ ఆమెకు ముత్తాత.

స్వీడన్‌లో జన్మించిన 41 ఏళ్ల నీలా వీఖే పాటిల్ ప్రాథమిక విద్యను మహారాష్ట్రలోని అహల్యానగర్ లో అభ్యసించారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం తిరిగి స్వీడన్ చేరుకున్నారు. 15 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడే మహారాష్ట్ర ఆర్థిక మంత్రిగా బాలాసాహెబ్ వీఖే పాటిల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతులను చదివారు. రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు. జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు ఆయనతో ప్రతి వారం ఫోన్ చేసి మాట్లాడానని, ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. తన విజయానికి తాతయ్య బాలసాహెబ్ విఖే పాటిల్ ఇచ్చిన స్ఫూర్తి ఎంతో ఉందని నీలా గుర్తు చేసుకున్నారు.
స్వీడన్ రాజకీయాల్లో క్రమంగా ఎదుగుతూ నీలా తనకంటూ ఒక బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. గతంలో ఆమె ఆ దేశ మాజీ ప్రధానమంత్రి స్టీఫన్ లోఫ్వెన్ హయాంలో ప్రధాని కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రధానంగా ఆర్థికం, పన్నులు, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖల వ్యవహారాల్లో పీఎంవో సలహాదారుగా పనిచేశారు. స్టాక్‌హోమ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా ఎన్నికవడంతో పాటు గ్రీన్ పార్టీ తరఫున పలు కమిటీల్లో చురుకైన పాత్ర పోషించారు.
విద్యాపరంగా ఆమె గోథెన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ లా నుండి ఎకనామిక్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. అటు స్పెయిన్‌లోని మాడ్రిడ్ యూనివర్సిటీలోనూ విద్యను అభ్యసించారు. పార్లమెంట్‌లో ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులపై పోరాడటం తన బాధ్యత అని నీలా స్పష్టం చేశారు. అలాగే ఓటు హక్కు లేని వలసదారుల పిల్లల హక్కులు, వారి సంక్షేమం కోసం పని చేస్తానని ఆమె ప్రకటించారు.
ప్రస్తుతం జరిగిన స్వీడన్ సార్వత్రిక ఎన్నికలు ఆ దేశంలో ఊహించని రాజకీయ మార్పులకు దారితీశాయి. మొత్తం 349 స్థానాలు కలిగిన పార్లమెంట్‌లో నాలుగు వామపక్ష కూటమి పార్టీలు కలిసి 176 స్థానాలతో స్వల్ప మెజారిటీని సొంతం చేసుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్థానాల కంటే ఇది మూడు సీట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో అధికార కన్జర్వేటివ్ కూటమి పరాజయంతో ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ తన పదవికి రాజీనామా సమర్పించారు.
మరోవైపు మాజీ ప్రధాని మాగ్డలీనా ఆండర్సన్ నేతృత్వంలోని సోషల్ డెమోక్రాట్స్ పార్టీ 99 స్థానాలతో అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది. కూటమిలో ఉండే విభిన్న సైద్ధాంతిక వైరుధ్యాల కారణంగా నూతన మంత్రివర్గ ఏర్పాటు అత్యంత రసవత్తరంగా మారనుంది. ఈ ఉత్కంఠభరిత వాతావరణం మధ్య నీలా విఖే పాటిల్ సాధించిన ఘనత ఇటు మహారాష్ట్రలోనే కాకుండా యావత్ భారతదేశంలో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications
