తెలంగాణ పాఠశాల విద్యార్థులకు మరింత ఆకర్షణీయంగా.. ప్రైవేట్ స్కూళ్లకు తీసిపోని విధంగా
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి మరింత ఆకర్షణీయమైన రంగులు, నూతన డిజైన్లతో కూడిన యూనిఫాంలు అందనున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, పాఠశాల హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు దుస్తులు, ఇతర నిత్యావసర విద్యా సామగ్రి పంపిణీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల యూనిఫాం రూపకల్పన, పంపిణీపై ఆదేశాలు జారీ చేశారు.
వచ్చే విద్యాసంవత్సరంలో బడులు తెరిచే మొదటి రోజే విద్యార్థులందరికీ దుస్తులు, పాఠ్యపుస్తకాలు, ఇతర అవసరమైన వస్తువులు అందేలా ముందస్తుగా సమగ్ర కార్యాచరణను సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల దుస్తులకు ఏమాత్రం తీసిపోని విధంగా, పిల్లలు ఇష్టపడే ఆధునిక డిజైన్లు, ఆకర్షణీయమైన రంగులను ఎంపిక చేసేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు.

ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యా సామాగ్రి సరఫరా పురోగతిపై రేవంత్ రెడ్డి ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతి గృహాలు, గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు ఇప్పటికే మొదటి జత యూనిఫాంల సరఫరా చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రెండవ జత దుస్తులను కూడా ఈ సెప్టెంబర్ నెలాఖరు నాటికి విద్యార్థులందరికీ అందిస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే విద్యాశాఖ ద్వారా రెండు జతల యూనిఫాంలను పంపిణీ చేయడం పూర్తయిందని అధికారులు వివరించారు. యూనిఫాంతో పాటు విద్యార్థులందరికీ నోట్ బుక్స్ పంపిణీ ప్రక్రియ కూడా వంద శాతం ముగిసిందని పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల పరిధిలోని విద్యార్థులందరికీ రోజువారీ అవసరాల కోసం ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు, స్పూన్లు, కప్పులతో పాటు కార్పెట్లు, బెడ్ షీట్లు, నాణ్యమైన టవళ్లను అందించినట్లు వివరించారు.
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని, వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాలు మరింత పెరిగే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి విశ్లేషించారు. బడుల్లో అడ్మిషన్లు కనీసం 10 శాతం మేర పెరిగే అవకాశం ఉందని, అందుకు తగిన విధంగా అదనపు వస్తు సామగ్రిని ముందస్తుగానే అంచనా వేసి సిద్ధంగా ఉంచాలని అధికారులను సూచించారు. ఈ ఏడాది తమ ప్రభుత్వం అందించిన యూనిఫాంల నాణ్యతతో పాటు ఇతర సదుపాయాలపై విద్యార్థుల తల్లిదండ్రులు సంతృప్తిని వ్యక్తం చేయడం శుభపరిణామమని సీఎం పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు పీ సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, అధికారులు ఎస్ శ్రీధర్, వేముల శ్రీనివాసులు, సబ్యసాచి ఘోష్, బాల మాయాదేవి, అహ్మద్ నదీమ్, దివ్య దేవరాజన్, నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
