ఏపీలో ప్రభుత్వం మారి రెండేళ్లు దాటినా.. !!
రాయలసీమలో పారుతున్న కుందూ నదిపై నిర్మింత తలపెట్టిన రాజోలి రాజోలి రిజర్వాయర్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది. ఇప్పుడు అధికారంలో ఉన్నది.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దీని నిర్మాణంపై ప్రతి రోజూ విమర్శలు గుప్పిస్తూ వార్తల్లోకెక్కుతూ వచ్చిన అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీనే. ఇప్పుడీ ప్రాజెక్ట్ అంటూ ఒకటి ఉందనే విషయాన్ని దాదాపుగా విస్మరించిందనే అభిప్రాయాలు సీమవాసుల్లో వ్యక్తమౌతోన్నాయి.
ఏపీలో ప్రభుత్వం మారి రెండేళ్లు దాటినా రాజోలి, జోలాదరాసి ప్రాజెక్టులు ఇంచ్ కూడా ముందుకు కదలట్లేదు. అదే.. ఇప్పుడు కుందూ పరివాహక ప్రాంత రైతుల్లో ఆందోళనకు దారి తీస్తోంది. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల నాటి కల.. ఈ రిజర్వాయర్. జోలాదరాసి గానీ, రాజోలి జలాశయాల నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడం, ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం వారిని మరింత కలవరపాటుకు గురి చేస్తోంది.

ఈ రెండు ప్రాజెక్టులు గనక కార్యరూపాన్ని దాల్చి ఉంటే.. ప్రస్తుత కరవు పరిస్థితుల్లో కొంతమేరకైనా ఆదుకుని ఉండేదనే అభిప్రాయాలు రాయలసీమ జిల్లావాసుల్లో వ్యక్తమౌతోన్నాయి. నంద్యాల, కడప జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలను తీర్చడానికి ఈ రెండు జలాశయాలను తెర మీదికి వచ్చాయి గానీ.. ప్రభుత్వంలో మారినా కూడా వీటిల్లో ఎటువంటి కదలికా ఉండకపోవడం.. వీటి ఉనికిని సైతం ప్రశ్నార్థకం చేస్తోన్నాయి.
కుందూ నదికి వర్షాకాలంలో వచ్చే భారీ వరద ప్రవాహాన్ని అరికట్టడంతో పాటు శ్రీశైలం బ్యాక్ వాటర్ ను వినియోగించాలనే ఉద్దేశంతో 2008లో అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీనికి రూపకల్పన చేశారు. అదే ఏడాది శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం రాజోలి వద్ద 2.98 టీఎంసీల సామర్థ్యంతో రూ. 1,335 కోట్ల వ్యయంతో ఈ జలాశయాన్ని నిర్మించాల్సి ఉంది. దీనికోసం గొట్లూరు, రాజోలి, కొలిమిగుండ్ల వంటి గ్రామాల్లో 766 ఎకరాలను సేకరించారు.
ఎకరాకు రూ. 12.50 లక్షల పరిహారం ఇస్తామని 2021లో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించింది.కుందూ కుడి కాలువ విస్తరణ, ఆధునీకరణ కింద రూ. 1,400 కోట్లు మంజూరయ్యాయి. రాజోలి ప్రాజెక్టు పూర్తయితే కడప జిల్లాలో 90,000 ఎకరాల ఆయకట్టుకు శాశ్వతంగా నీటి వసతి లభిస్తుంది. దాదాపు ఒక టీఎంసీ నిల్వ సామర్థ్యంతో కోవెలకుంట్ల మండలం జొలదరాశి రిజర్వాయర్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ ఉండట్లేదు.
కోవెలకుంట్ల, బనగానపల్లి నియోజకవర్గాల్లో తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఎత్తిపోతల పథకాలను కూడా రూపొందించారు. దీని నిర్మాణానికి మొత్తం 2,465 ఎకరాల భూమి అవసరమని అంచనా వేశారు. మొదటి విడతలో 466 ఎకరాల పట్టా, అసైన్డ్ భూములను సేకరించారు కూడా. రైతులకు రూ. 72 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాకపోవడంతో జాప్యం ఏర్పడింది.
పరిహారం అందకపోవడంతో ఈ ప్రాంతాల రైతులు తమ సాగు పనులను కూడా కొనసాగించలేకపోతున్నారు. మరోపక్క భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు అధికారుల వద్దనే ఉండటం, సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న రైతులకు తమ అత్యవసరాల కోసం భూములు అమ్ముకోవడానికి గానీ, బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి గానీ వీలు లేకుండా పోయింది. నష్టపరిహారం అందక సుమారు అయిదేళ్లుగా నిరీక్షిస్తున్నారు.. ఈ ప్రాంత రైతులు.
రాయలసీమ ప్రాంత తాగు, సాగునీటి అవసరాలకు జీవనాడి లాంటి ఈ జలాశయాల పనులను సత్వరమే పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమస్యల వల్ల వ్యవసాయాన్ని నమ్ముకున్న వేలాది రైతు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నష్టపరిహార నిధులను వెంటనే విడుదల చేయాలని, వెలుగోడు ప్రాజెక్ట్ ను తమ ఖాతాలో వేసుకున్న కూటమి ప్రభుత్వం.. దీన్ని కూడా పూర్తి చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.















Click it and Unblock the Notifications
