శ్రీవారి ప్రసాదాలకు కళంకితం అంటగట్టారు..: రోజా
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలకు దిగింది. కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసిన సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాష్ చంద్ మంగ్లాను ఈడీ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కింద ఆయనను అదుపులోకి తీసుకుంది. అనంతరం విశాఖపట్నం పీఎమ్‌ఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఈ అరెస్ట్ పై ఈడీ ఓ సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది.
ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు, ఇతర వ్యర్థాలు, చేపనూనె కలిసిందంటూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రచారం మొత్తం అబద్ధమేనని ఈడీ తాజా నివేదిక తేల్చి చెప్పినట్టయిందనే అభిప్రాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమౌతోన్నాయి.

దీనిపై మాజీ మంత్రి రోజా స్పందించారు. తమ ప్రభుత్వ హయాంలో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యి ట్యాంకర్లను వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలోని అప్పటి టీటీడీ పాలకమండలి తిరస్కరించిందని గుర్తు చేశారు. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించినట్లు ఎలాంటి ఆధారం లేకపోయినా చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు విపరీతంగా దుష్ప్రచారం చేశారని అన్నారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఎలా ప్రకటించారంటూ సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు.
ఇటువంటి ప్రకటనలు చేయడం.. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కాదా అని అన్నారు. శ్రీవారి ప్రసాదాలు పరమ పవిత్రం అనే విషయం.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేళ నిజం నిర్ధారణ జరిగిందని రోజా వ్యాఖ్యానించారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాలకు కళంకితం అంటగట్టే ప్రయత్నం చేసిన నాయకులు ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలని అన్నారు.












Click it and Unblock the Notifications
