టైం చూసి DMK, AIADMK ను భారీ దెబ్బ కొట్టిన విజయ్ - ఒక్క నిర్ణయంతో సీన్ ఛేంజ్..!!
తమిళనాట సీఎం విజయ్ నిర్ణయాలు ఆసక్తిగా మారుతున్నాయి. పూర్టి మెజార్టీ లేకపోయినా మిత్ర పక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయ్ క్రమేణా బలం పెంచుకుంటున్నారు. తిరుగు లేదని భావించిన డీఎంకే, అన్నా డీఎంకేలకు తన మార్క్ రాజకీయం ఏంటో చూపిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఉప ఎన్నికలు విజయ్ సమర్దతకు పరీక్షగా మారాయి. వీటిల్లో విజయ్ ను దెబ్బ కొట్టి రాజ కీయంగా పై చేయి సాధించాలని ఆ రెండు పార్టీలు భావించాయి. అయితే.. విజయ్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు మొత్తం సీన్ మార్చేస్తున్నట్లు కనిపిస్తోంది.
తమిళనాడులో తారాపురం, మధురాంతకం నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు చోట్ల గెలుపు విజయ్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. తమ పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా సీఎం విజయ్ ప్రచార షెడ్యూల్ ఫిక్స్ చేసారు. రెండు చోట్లా టీవీకే, డీఎంకే, అన్నాడీఎంకే, కమ్యూనిస్టు పార్టీలు, ఎన్టీకే పార్టీలు పోటీ చేస్తున్నాయి. రెండు నియోజకవర్గాల్లోనూ పంచముఖ పోటీ నెలకొంది. తారాపురంలో ఈ నెల 25న, అక్టోబరు 2న విజయ్ ప్రచారం చేయనున్నారు.

ఇదే రీతిలో డీఎంకే అభ్యర్థుల తరఫున ఆ పార్టీ నేతలు స్టాలిన్, ఉదయనిధి కూడా రెండు నియోజకవర్గాల్లో రెండు రోజుల చొప్పున ప్రచారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటు న్నారు. అన్నాడీఎంకే అభ్యర్థికి మద్దతుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రచారం చేయనున్నారు. డీఎంకే నుంచి ఉదయనిధి స్టాలిన్ ఈ ఉప ఎన్నికల బాధ్యతలను నిర్వహిస్తూ.. కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో సమీకరణాలు మారిపోతున్నాయి.
విజయ్ మాస్టర్ స్ట్రోక్
ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న ఎన్నికలు కావటంతో అటు డీఎంకే, ఇటు అన్నా డీఎంకే విజయ్ ను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఓటు చీలకుండా క్షేత్ర స్థాయిలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఈ సమయంలోనే విజయ్ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతి నవజాత శిశువుకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పథకాన్ని సెప్టెంబర్ 28న అధికారికంగా ప్రారంభించనున్నారు. భవిష్యత్తులో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలోనే శిశువులకు వీటిని అందించేలా పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప ఎన్నికల వేళ ఈ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్ గా భావిస్తున్నారు. ఈ ఒక్క నిర్ణయం ఉప ఎన్నికల వేళ విజయ్ కు కలిసి వస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications
