Rs 100 Coin: 1000 ఏళ్ల శిల్పకళా వైభవం.. మార్కెట్లోకి కొత్త రూ.100 నాణెం!
భారతీయ సనాతన ధర్మానికి, ప్రాచీన శిల్పకళా అద్భుతాలకు సజీవ సాక్ష్యంగా నిలిచే గుజరాత్‌లోని ప్రసిద్ధ 'మోధేరా సూర్య దేవాలయం' నిర్మించి వెయ్యి సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా రూ.100 స్మారక నాణేన్ని (Commemorative Coin) విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. కాయినేజ్ యాక్ట్ 2011 కింద 'రూల్స్ 2026'ను రూపొందిస్తూ ఈ నిర్ణయాన్ని లాంఛనంగా ఖరారు చేసింది.
ఈ నూతన రూ.100 నాణెం ఒకవైపు అత్యంత ఆకర్షణీయంగా జాతీయ ప్రాధాన్యత కలిగిన చిహ్నాలతో రూపొందుతోంది. నాణెం బొమ్మ (ముందు) భాగంలో మధ్యలో అశోక చక్రం, దాని కింద 'సత్యమేవ జయతే' అని దేవనాగరి లిపిలో పొందుపరిచారు. నాణేనికి ఎడమ వైపున దేవనాగరి లిపిలో 'భారత్', కుడి వైపున ఆంగ్లంలో 'INDIA' అని చెక్కారు. అలాగే అంతర్జాతీయ సంఖ్యల్లో నాణెం విలువ '100' తో పాటు నూతన రూపాయి చిహ్నం (₹) స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేశారు.

నాణెం వెనుక భాగం.. చారిత్రక సూర్య ఆలయం!
నాణెం వెనుక భాగంలో మోధేరా సూర్య దేవాలయ ప్రధాన శిల్పకళా రూపాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ముద్రించారు. ఆలయ చిత్రం పైన వెయ్యేళ్ల చారిత్రక ప్రయాణాన్ని ప్రతిబింబించేలా "1026-2026" సంవత్సరాలను స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే నాణెం కింది భాగంలో ఇంగ్లీషులో "1000 YEARS OF MODHERA SUN TEMPLE, GUJARAT" అని ముద్రించారు. క్రీస్తు శకం 1026లో నిర్మించిన ఈ ఆలయం.. పద్ధెనిమిదో శతాబ్దపు సూర్య భగవానుడి ప్రాచీన సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తోంది.
శిల్పకళా అద్భుతం.. మోధేరా సూర్యకుండ్!
గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఉన్న ఈ మోధేరా సూర్యదేవాలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ సూర్య క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి కట్టడం, రాళ్లపై చెక్కిన సూక్ష్మ శిల్పకళ, సూర్య భగవానుడి కిరణాలు నేరుగా పడేలా నిర్మించిన గర్భగుడి అమరిక ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ప్రత్యేకించి ఆలయం ముందున్న 'సూర్యకుండ్' అనే దిగుడు బావి, దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న గుళ్లు ప్రాచీన ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. అటువంటి మహోన్నతమైన క్షేత్రం వెయ్యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని గుర్తుగా ఉంచుకోవడానికే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక నాణేన్ని అందుబాటులోకి తెచ్చింది.














Click it and Unblock the Notifications
