న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ కు గాయం: భారత్ తో సిరీస్ కు దూరం?
న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర ఊహించని రీతిలో గాయపడ్డాడు. ఆక్లాండ్‌లో ఓ ప్రమోషనల్ వీడియో షూటింగ్లో పాల్గొన్న సమయంలో అతని కుడి భుజం డిస్లొకేట్ అయింది. భారత్‌తో జరగబోయే అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు అతను గాయపడటం న్యూజిలాండ్ కు విఘాతంలా పరిణమించింది. అక్టోబర్ 22వ తేదీన ప్రారంభం కానుందీ సిరీస్. దీనికి అతను అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది.
ప్రొమో షూటింగ్ సమయంలో ఓ డైవింగ్ క్యాచ్ అందుకునే యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. డైవ్ చేస్తూ క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించినప్పుడు రచిన్ రవీంద్ర అదుపు తప్పాడు. నేలపై అమర్చిన సేఫ్టీ మ్యాట్‌పై సరిగ్గా ల్యాండ్ కాలేకపోయాడు. అతని కుడిభుజం మ్యాట్ ను తాకినప్పుడు బరువు అంతా దీని మీదే పడింది. నొప్పితో తీవ్ర ఇబ్బందిపడ్డాడు రచిన్. అనంతరం డాక్టర్లు అతనికి పరీక్షలు నిర్వహించారు. ఫ్రాక్చర్ జరగలేదని ధృవీకరించారు.

ఇది కివీస్ కు కొంత వరకు ఉపశమనం కలిగించే అంశం. అయినప్పటికీ.. అతను పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని చెబుతున్నారు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పర్యవేక్షణలో రచిన్ రవీంద్ర ప్రత్యేక రిహాబిలిటేషన్ లోకి వెళ్లాడు. ఆటగాళ్ల ఫిట్ నెస్ కు సంబంధించి అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రచిన్ గాయపడటం దురదృష్టకరమని న్యూజిలాండ్ జట్టు మేనేజర్ మైక్ శాండిల్ ఆవేదన వ్యక్తం చేశారు.
న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ కూడా ఈ గాయంపై స్పష్టత ఇచ్చారు. రాబోయే ఆరు నెలల్లో కివీస్ జట్టు కీలక మ్యాచ్‌లను ఆడాల్సి ఉందని, అందువల్ల రచిన్ రవీంద్ర విషయంలో తొందరపడదలచుకోలేదని చెప్పారు. రచిన్ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించిన తర్వాతే జట్టులోకి పునరాగమనం చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. టెస్ట్ సిరీస్‌ల ప్రాధాన్యత దృష్ట్యా అతనికి తగినంత విశ్రాంతినిచ్చే యోచనలో మేనేజ్మెంట్ ఉంది.
టీ20, వన్డే ఫార్మట్ లో రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ జట్టుకు బ్యాక్ బోన్. ఇప్పటివరకు 52 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 759 పరుగులు చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌తో 26 వికెట్లు పడగొట్టాడు. భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును వచ్చే వారం ప్రకటించనున్నారు. ఈ కీలక సిరీస్‌కు సీనియర్ ఆటగాడు మిచెల్ శాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
