ఆసియా క్రీడల ప్రారంభోత్సవంలో ఊహించని ట్విస్ట్!
జపాన్‌లోని నగోయా నగరంలో ఉన్న ప్రముఖ మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 20వ ఆసియా క్రీడలు అత్యంత వైభవంగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రంగులమయమైన కార్యక్రమంతో శనివారం(సెప్టెంబర్ 19) అధికారికంగా ప్రారంభమయ్యాయి. జపాన్ చక్రవర్తి నరుహిటో, సామ్రాజ్ఞి మసాకో, ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ తాత్కాలిక అధ్యక్షుడు షేక్ జువాన్ బిన్ హమద్ అల్ థానీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు కిర్ట్సీ కోవెంట్రీల సమక్షంలో ఈ క్రీడలను జపాన్ చక్రవర్తి అధికారికంగా ప్రారంభించారు.
దాదాపు రెండు గంటల పాటు అలరించిన ఈ వేడుక జపాన్ జాతీయ గీతాలాపన, జాతీయ పతాకావిష్కరణతో మొదలైంది. జపాన్ స్వయం రక్షణ దళానికి చెందిన 9 మంది సభ్యులు వేదికపైకి జెండాను గౌరవప్రదంగా తీసుకెళ్లారు. అనంతరం స్టేడియంలోని కాంతులను తగ్గించి కేవలం స్పాట్‌లైట్ కాంతిలో జపాన్ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ నిర్వహించిన డిజిటల్ లైటింగ్ ప్రదర్శన ప్రేక్షకులను మంత్రుముగ్ధులను చేసింది.

ఆకట్టుకున్న అథ్లెట్ల కవాతు
ప్రారంభోత్సవ ప్రధాన ఆకర్షణగా 45 సభ్య దేశాలతో పాటు ఓసీఏ శరణార్థుల బృందం పాల్గొన్న అథ్లెట్ల మార్చ్ పాస్ట్ సాగింది. మొత్తం 46 బృందాలు ఈ కవాతులో పాల్గొనగా.. అత్యంత భారీగా 800 మందికి పైగా క్రీడాకారులతో చైనా బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత బృందానికి పారిస్ ఒలింపిక్స్ డబుల్ పతక విజేత షూటర్ మను భాకర్, గత హాంగ్‌జౌ ఆసియాడ్ స్వర్ణ పతక విజేత, కబడ్డీ స్టార్ పవన్ సెహ్రావత్ పతాకధారులుగా వ్యవహరించారు. వీరు భారతీయ సాంప్రదాయ శైలిలోని ముదురు నీలం రంగు బ్లేజర్లను ధరించి త్రివర్ణ పతాకాన్ని గర్వంగా చేతబూని కవాతులో ముందుకు సాగారు.
తొలుత మను భాకర్‌తో పాటు షాట్‌పుట్ ఛాంపియన్ తజిందర్‌పాల్ సింగ్ తూర్ పతాకధారిగా వ్యవహరిస్తారని ప్రకటించినప్పటికీ.. ఆయనకు సరైన సమయానికి అధికారిక కిట్ అందకపోవడం, శిక్షణ శిబిరం నుంచి చేరుకోవడంలో ఆలస్యం కావడంతో చివరి నిమిషంలో పవన్ సెహ్రావత్‌ను తూర్ స్థానంలో పతాకధారిగా ఎంపిక చేశారు.
ఖాళీ సీట్లపై సందేహాలు
ఓ వైపు ఆకర్షణీయమైన లైటింగ్, అత్యాధునిక సాంకేతికత, సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రారంభోత్సవం అద్భుతంగా జరిగినప్పటికీ.. స్టేడియంలోని చాలా స్టాండ్స్‌లో సీట్లు ఖాళీగా కనిపించడం గమనార్హం. సాధారణంగా అంతర్జాతీయ క్రీడల ప్రారంభోత్సవాల్లో కనిపించే విపరీతమైన జనసందోహం ఈ సారి తక్కువగా కనిపించడం క్రీడాభిమానులను, విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సారి జపాన్ ఆసియాడ్ లో భారత్ నుంచి మొత్తం 501 మంది క్రీడాకారులతో కూడిన భారీ బృందం బరిలోకి దిగుతోంది. గత 2023 హాంగ్‌జౌ ఆసియాడ్ క్రీడల్లో సాధించిన చారిత్రాత్మక 106 పతకాల(28 స్వర్ణాలు) రికార్డును అధిగమించి పతకాల పట్టికలో మరింత మెరుగైన స్థానాన్ని సాధించడమే లక్ష్యంగా టీమిండియా ఈ టోర్నీని ప్రారంభించింది.
ముందే మొదలైన సమరాలు
క్రీడల అధికారిక ప్రారంభోత్సవానికి ముందే కొన్ని విభాగాల్లో మ్యాచ్ లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మహిళల క్రికెట్ విభాగంలో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఆతిథ్య జపాన్ జట్టుపై 8 వికెట్ల తేడాతో గెలిచి సెమీఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. ఇక ఆసియాడ్ లో తొలిసారిగా ప్రవేశపెట్టిన నూతన క్రీడా టెక్బాల్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత క్రీడాకారిణి క్విమ్సీ డిసౌజా ఓటమి పాలైనప్పటికీ.. కాంస్య పతక పోరులో నిలిచింది.
సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు కొనసాగనున్న ఈ 20వ ఆసియా క్రీడల్లో 45 దేశాలకు చెందిన దాదాపు 11 వేల మంది అథ్లెట్లు 43 క్రీడాంశాల్లోని 469 స్వర్ణ పతకాల కోసం పోటీ పడనున్నారు.














Click it and Unblock the Notifications
