టాటా సియెర్రా లెజెండ్ సిరీస్ లాంచ్: టాప్ వేరియంట్ ఫీచర్లు ఇప్పుడు తక్కువ ధరకే!
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన ప్రజాదరణ పొందిన 'సియెర్రా' ఎస్‌యూవీ మోడల్‌లో సరికొత్త 'లెజెండ్ సిరీస్'ను దేశీయ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశపెట్టింది. ఇప్పటికే మార్కెట్లో నెలకు వేల సంఖ్యలో విక్రయాలు సాధిస్తున్న సియెర్రా మోడల్‌కు మరింత ఆదరణ పెంచేందుకు ఈ ప్రత్యేక సిరీస్‌ను రూపొందించారు. గతంలో కేవలం ఖరీదైన టాప్ వేరియంట్లలో మాత్రమే లభించే ప్రీమియం, విలాసవంతమైన ఫీచర్లను ఇప్పుడు తక్కువ ధరలోని వేరియంట్లకు తీసుకురావడమే ఈ కొత్త సిరీస్ ముఖ్య ఉద్దేశం.
18 విభిన్న వేరియంట్లతో విస్తృత ఎంపికలు
ఈ కొత్త లెజెండ్ సిరీస్‌లో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మొత్తం 18 వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి ప్రధానంగా 5 ట్రిమ్‌ల(స్మార్ట్ ప్లస్ ఎల్, ప్యూర్ ఎల్, ప్యూర్ ఎల్ ఓ, ప్యూర్ ప్లస్ ఎల్, అడ్వెంచర్ ప్లస్ ఎల్) ఆధారంగా వర్గీకరించబడ్డాయి. సాధారణ సియెర్రా లోయర్, మిడ్-స్పెక్ మోడళ్లపై అదనపు ఆకర్షణీయమైన ఫీచర్లను జోడించి, వీటి పేర్ల చివర ఎల్ ప్యాకేజీ సూచికను చేర్చారు.

రూ.11.99 లక్షల నుంచి ధరలు ప్రారంభం
ధరల వివరాల్లోకి వెళ్తే.. టాటా సియెర్రా లెజెండ్ సిరీస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.99 లక్షలుగా నిర్ణయించగా.. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.19.49 లక్షల వరకు ఉంది. సాధారణ స్టాండర్డ్ వేరియంట్లతో పోలిస్తే.. ఈ లెజెండ్ సిరీస్ మోడళ్ల ధర కేవలం రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు మాత్రమే అదనంగా ఉంటుంది. ఈ తక్కువ తేడాకే అత్యుత్తమ ఫీచర్లు లభిస్తుండటంతో కొనుగోలుదారులకు ఇది మంచి ఎంపికగా నిలవనుంది.
ఏ వేరియంట్ ధర ఎంత?
స్మార్ట్ ప్లస్ ఎల్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.11.99 లక్షలు కాగా.. డీజిల్ మాన్యువల్ ధర రూ.13.49 లక్షలుగా ఉంది. ప్యూర్ ఎల్ పెట్రోల్ మాన్యువల్ ధర రూ.13.79 లక్షలు, పెట్రోల్ డీసీటీ ధర రూ.14.99 లక్షలు, డీజిల్ మాన్యువల్ ధర రూ.15.24 లక్షలుగా ఉంది. ప్యూర్ ఎల్ ఓ వేరియంట్ మాన్యువల్‌తో రూ.14.29 లక్షలు, డీసీటీతో రూ.15.59 లక్షలు, డీజిల్ మాన్యువల్‌తో రూ.15.74 లక్షలు, డీజిల్ ఆటోమేటిక్‌తో రూ.16.99 లక్షల ధరకు లభిస్తుంది. ప్యూర్ ప్లస్ ఎల్ వేరియంట్ ధరలు పెట్రోల్ మాన్యువల్‌కు రూ.14.99 లక్షలు, పెట్రోల్ డీసీటీకి రూ.16.29 లక్షలు, డీజిల్ మాన్యువల్‌కు రూ.16.44 లక్షలు, డీజిల్ ఆటోమేటిక్‌కు రూ.17.74 లక్షలుగా ఉన్నాయి. అడ్వెంచర్ ప్లస్ ఎల్ సిరీస్‌లో పెట్రోల్ మాన్యువల్ ధర రూ.16.99 లక్షలు, పెట్రోల్ డీసీటీ ధర రూ.18.29 లక్షలు, డీజిల్ మాన్యువల్ ధర రూ.18.19 లక్షలు, డీజిల్ ఆటోమేటిక్ ధర రూ.19.49 లక్షలు, టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ ధర రూ.18.99 లక్షలుగా ఉంది.
అందుబాటు ధరలోనే లగ్జరీ ఫీచర్లు
గతంలో అత్యధిక ధర కలిగిన ఫీల్-గుడ్, ప్రీమియం ఫీచర్లపై టాటా దృష్టి పెట్టింది. గతంలో ఎక్కువ ధర కలిగిన హై-స్పెక్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉన్న కొన్ని ఫీచర్లను ఇప్పుడు తక్కువ ధర కలిగిన వేరియంట్లలో కూడా అందిస్తోంది. సియెర్రా ప్యూర్ ప్లస్ ఎల్ వేరియంట్ లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6-వే పవర్డ్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గతంలో ఇవి సియెర్రా అకంప్లిష్డ్ ట్రిమ్ లో మాత్రమే అందుబాటులో ఉండేవి. అంతే కాకుండా డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మాన్యువల్ బాస్ మోడ్, థై సపోర్ట్ ఎక్స్‌టెండర్, పూర్తి లెదరెట్ ఇంటీరియర్ ఫినిషింగ్ వంటి ఫీచర్లు క్యాబిన్‌కు ప్రీమియం లుక్‌ను అందిస్తాయి.
బేస్ వేరియంట్ నుంచే అధునాతన ఇంటీరియర్, టెక్నాలజీ
ఎంట్రీ-లెవెల్ వేరియంట్లలో కూడా లెదరెట్ సీట్లు, ఆటో ఫోల్డింద్ ఓఆర్వీఎంలు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వీల్ కవర్లు, రూఫ్ రైల్స్ వంటి వసతులను పొందుపరిచారు. ప్యూర్ ఎల్ మోడల్ నుంచి 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో, రియర్ కెమెరా, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ లభిస్తాయి.
ఇంజిన్, గేర్‌బాక్స్ ఆప్షన్లలో మార్పుల్లేవ్..
ఈ లెజెండ్ సిరీస్ లో వాహనానికి చెందిన మెకానికల్ సెటప్ లేదా ఇంజిన్ ఆప్షన్లలో కంపెనీ ఎటువంటి మార్పులూ చేయలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ప్రత్యామ్నాయాలు, వాటి మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ కాంబినేషన్లలోనే కొనసాగుతున్నాయి. కేవలం ఆకర్షణీయమైన ఫీచర్లను సరసమైన ధరల్లోకి చేర్చడం ద్వారా టాటా మోటార్స్ సియెర్రా ప్రియులకు అద్భుతమైన అవకాశాన్ని అందించింది.













Click it and Unblock the Notifications
