వచ్చే 20 ఏళ్లలో భారత్ స్థానం ఇదే.. అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భారత్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న 20 ఏళ్లలో భారత జీడీపీ 38 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని హర్షం వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఉన్న 4.015 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ నుంచి 38 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకు చేరుతుందని ఆయన అంచనా వేశారు.
ఉత్తరాఖండ్ లోని ఐఐటీ రూర్కీ లో నిర్వహించిన స్నాతకోత్సవం కార్యక్రమానికి అజిత్ దోవల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం మాట్లాడారు. ప్రస్తుతం ఇలాంటి కాలంలో విద్యార్థులు జీవిస్తున్నందుకు వాళ్లు అదృష్టవంతులను రానున్న కాలంలో విద్యార్థుల భవిష్యత్తు మరింత నమ్మకమైన భరోసా ఇక్కడ ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే విద్యార్థులు శ్రీ రాముడి మాదిరి ధైర్య సాహసాలతో ఉండాలని సూచించారు. శ్రీరాముడి ధైర్య సాహసాలను చూసే మహార్షి విశ్వామిత్రుడు రాక్షసులను అంతమొందించేందుకు ఆయన్ను ఎంచుకున్నాడని గుర్తుచేశారు.
" దేశంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అత్యద్భుతమైన భవిష్యత్తు దిశగా భారత్ అడుగులు వేస్తోంది. 2047 అమృత్ కాల్ అని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే తెలిపారు. ఇది నిజంగా అద్భుతమైన అమృత కాలం. భారత ప్రస్తుత జీడీపీ 4.015 ట్రిలియన్ గా ఉంది. అయితే వచ్చే 20 ఏళ్లలో అది 38 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుతుంది" అని దోవల్ స్పష్టం చేశారు. అలాగే తాను సిక్కింలో గతంలో పోస్టింగ్ ఇచ్చినప్పుడు అక్కడ ఓ గురువు వద్ద మూడు మంత్రాలను నేర్చుకున్నానని అవి తన జీవితంలో విజయవంతం అవ్వడానికి ఎంతో సాయపడ్డాయని వివరించారు. అందులో మొదటిది మనం ఎక్కడ ఉన్నాం.. రెండోది మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలి. ఇక మూడోది అక్కడకు వెళ్లినా తిరిగి మళ్లీ ఇక్కడకు ఎలా చేరుకోవాలి..? అనే దానిపైనే ఉంటుందని విద్యార్థులకు అజిత్ దోవల్ హితబోధ చేశారు.

ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో పెరిగిపోయిందని యువత, విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఏర్పడుతున్నాయని అజిత్ దోవల్ తెలిపారు. మీ ముందు తరాల ప్రజలు బానిసత్వంలో మగ్గిపోయారని.. ఇప్పటి యువతకు ఉన్నన్ని అవకాశాలు వారికి ఉండేవి కావని వివరించారు. ఇక వృద్ధి సాధించడంలో ఏ దేశానికైనా టెక్నాలజీ అత్యంత కీలకమైన శక్తిగా ఉండే దశలోకి మీరు అడుగుపెడుతున్నారని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మీరు ఎన్నో అద్భుతాలను సాధించగలరు అని అజిత్ దోవల్ తెలిపారు.












Click it and Unblock the Notifications
