ఖాళీ కడుపుతో ఈ వాటర్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఉదయాన్నే పరగడుపున రకరకాల హెల్తీ డ్రింక్స్ తీసుకోవడం ఈ రోజుల్లో ఓ అలవాటుగా మారింది. మన వంటింట్లో సులభంగా లభించే జీలకర్ర, వాము, సోంపు గింజల మిశ్రమంతో తయారుచేసే నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మూడు సహజసిద్ధ దినుసులలో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మొత్తం శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఉదయం పూట ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు పోషకాలను గ్రహించే శక్తి శరీరానికి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వేడివేడి టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా జీలకర్ర, వాము, సోంపు నీటిని తాగడం వల్ల శరీరానికి తక్షణ హైడ్రేషన్ లభిస్తుంది. ఇందులోని బయోయాక్టివ్ సమ్మేళనాలు సులభంగా జీర్ణమౌతాయి. ఇది ఉదయాన్నే వివిధ జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపించి రోజంతా కడుపును తేలికగా ఉంచడానికి దోహదపడుతుంది.

గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి అసౌకర్య సమస్యలతో బాధపడేవారికి ఈ మూడు గింజల డిటాక్స్ డ్రింక్ అద్భుతమైన ఉపశమనాన్ని ఇస్తుంది. జీలకర్రలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, అంతర్గత నొప్పులను తగ్గిస్తాయి. అలాగే వాము, సోంపు గింజలు జీర్ణవ్యవస్థ కండరాలను సడలించి తిన్న ఆహారం త్వరగా అరిగేలా చేస్తాయి. ఇది శరీరంలో జీవక్రియ రేటును వేగవంతం చేయడం ద్వారా అదనపు కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది.
ఈ హెల్తీ డ్రింక్‌ను మన ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఓ గ్లాస్ నీటిలో టీస్పూన్ జీలకర్ర, టీస్పూన్ వాము, టీస్పూన్ సోంపు గింజలను వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని బాగా మరిగించి, వడకట్టుకుని గోరువెచ్చగా తాగాలి. ఒకవేళ రాత్రి నానబెట్టడం మర్చిపోతే ఉదయాన్నే ఈ మూడు గింజలను నీటిలో వేసి కనీసం అయిదు నిమిషాల పాటు బాగా మరిగించి కూడా తీసుకోవచ్చు.
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఈ హెల్త్ డ్రింక్ సహాయపడుతుంది. ముఖ్యంగా జీలకర్ర.. ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి, గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. మధుమేహం ఉన్నవారు దీన్ని తీసుకునే ముందు డాక్టర్లను సంప్రదించడం మంచిది. వారి సూచనలకు అనుగుణంగా ఎంత పరిమాణంలో జీలకర్ర, వాము, సోంపు నీటిని తీసుకోవాలనేది తెలుసుకోవాలి. చికిత్సలో భాగంగా దీనిని తీసుకునే ముందు డాక్టర్ల సలహా తీసుకోవాలి.
ఈ సహజసిద్ధమైన పానీయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, కొందరు దీనిని తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. గర్భిణీలు, ఎసిడిటీ, తరచూ గుండెల్లో మంట వంటి సమస్యలతో బాధపడేవారు ఈ నీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. డాక్టర్ల సలహా మేరకు తగిన మోతాదులో తీసుకోవచ్చు. మధుమేహం కోసం ఇప్పటికే హై డోస్ మందులు వాడుతున్నవారు, మసాలా దినుసుల పట్ల అలర్జీ ఉన్నవారు తమ దినచర్యలో ఈ డ్రింక్‌ను చేర్చుకునే ముందు తప్పనిసరిగా ఒకసారి వైద్యులను సంప్రదించడం ఎంతో అవసరం.















Click it and Unblock the Notifications
