ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు వెనుక అసలు నిజం చెప్పిన కపిల్ దేవ్!
భారత క్రికెట్ జట్టు మైదానంలో పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయకూడదనే వైఖరిపై కొనసాగుతున్న వివాదంపై భారత మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. ఈ విషయంలో తన కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పారు. 2026 మహిళల ఆసియా కప్ లో భారత జట్టు విజేతగా నిలిచినప్పటికీ.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ మంత్రి అయిన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
ప్రభుత్వం, బీసీసీఐ నిర్ణయాలకే నా మద్దతు
ఇలాంటి సున్నితమైన అంశాల్లో వ్యక్తిగత అభిప్రాయాల కంటే ప్రభుత్వం, క్రికెట్ బోర్డు తీసుకునే విధానపరమైన నిర్ణయాలకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కపిల్ దేవ్ స్పష్టం చేశారు. "మా బోర్డు పాకిస్థాన్‌తో కరచాలనం చేయవద్దని చెబితే నేను చేయను. ఆడవద్దంటే ఆడను. అదే సమయంలో ఆడమని చెబితే కచ్చితంగా వెళ్లి ఆడతాను" అని ఆయన పేర్కొన్నారు. దేశ విధానమే తన నిర్ణయాలను నిర్దేశిస్తుందని ఆయన వివరించారు.

పహల్గాం దాడి తర్వాత మారిన వైఖరి
గతేడాది పహల్గాంలో జరిగిన విషాదకర ఉగ్రదాడి తర్వాత భారత్ తన క్రీడా వైఖరిని మరింత కఠినతరం చేసింది. అప్పటి నుంచి భారత పురుషుల, మహిళల జట్లు మైదానంలో పాకిస్తాన్ ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్ ఇవ్వడం నిలిపివేశాయి. తాజాగా జరిగిన మహిళల ఆసియా కప్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు కూడా ఇదే కఠిన వైఖరిని ప్రదర్శించి పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకుండా తమ నిరసనను తెలిపింది.
జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ సౌకర్యాలపై కామెంట్స్
మరోవైపు పాకిస్తాన్ మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్న తరుణంలో ఆయనకు కనీస మానవీయ సౌకర్యాలు కల్పించాలని కోరుతూ లేఖ రాసిన మాజీ కెప్టెన్లలో కపిల్ దేవ్ కూడా ఉన్నారు. ఈ అంశంపై స్పందిస్తూ.. పాకిస్తాన్ ప్రభుత్వ రాజకీయ విధానాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అయితే మైదానంలో తమతో కలిసి క్రికెట్ ఆడి తన దేశానికి గర్వకారణంగా నిలిచిన ఓ క్రీడాకారుడిగా ఇమ్రాన్ ఖాన్‌కు తగిన సౌకర్యాలు అందాలనే ఉద్దేశంతోనే మద్దతు తెలిపానని స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications
