సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో ట్విస్ట్..! సుప్రీంకు ఏపీ సర్కార్..!
ఏపీలో ఈ మధ్య కాలంలో తీవ్ర కలకలం రేపిన విజయవాడ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక సీఐ నాగరాజును ఇప్పటికే సస్పెండ్ చేయడంతో పాటు అరెస్టు చేసి జైలుకు పంపిన ఏపీ ప్రభుత్వానికి (AP Govt) ఆయన కస్టడీ విషయంలో మాత్రం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో సీఐ నాగరాజు కస్టడీపై వారు ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఈ కేసులో కీలకంగా మారబోతోంది.
విజయవాడ నడిబొడ్డున ఉన్న కృష్ణలంక పోలీసు స్టేషన్లో ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చిన పాత నేరస్తుడు గాదె సాయికృష్ణను లాకప్ డెత్ చేసి, శవాన్ని సైతం కాల్చేశారని ఆరోపణలు వచ్చాయి. కృష్ణలంక సీఐ నాగరాజు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే ఆయన్ను తొలుత అరెస్టు చేయని ప్రభుత్వం.. ఆ తర్వాత తీవ్ర విమర్శలు రావడంతో అరెస్టు చేయక తప్పలేదు. ఆ తర్వాత సిట్ అధికారులు నాగరాజును కస్టడీకి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో హైకోర్టు సీఐ నాగరాజును కస్టడీలో విచారించే విషయంలో పలు షరతులు పెట్టింది. విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డు చేయాలని సిట్ ను ఆదేశించింది. అలాగే విచారణ సమయంలో నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. నాగరాజును ఒక రోజు కృష్ణ లంక పీఎస్ లో, మిగిలిన రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలని ఆదేశించింది. విచారణ పేరుతో సిట్ తనను టార్చర్ పెట్టకుండా చూడాలని నాగరాజు చేసిన వినతి మేరకు హైకోర్టు తీసుకున్న ఆంక్షలపై సిట్ అసంతృప్తిగా ఉంది. అందుకే హైకోర్టు ఆదేశాలపై సిట్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై త్వరలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టబోతోంది.














Click it and Unblock the Notifications