M.R. Pallavi: చంటిబిడ్డతో అసెంబ్లీ సమావేశాలకు టీవీకే ఎమ్మెల్యే
తమిళనాడులో విజయ్ దళపతి టీవీకే పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. డీఎంకే, అన్నాడీఎంకే లాంటి కంచుకోటలను బద్దలు కొట్టి పార్టీ పెట్టిన తొలిసారే తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు విజయ్. తమిళనాట తనదైన శైలిలో పరిపాలన సాగిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే తాజాగా తమిళనాడు అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
టీవీకే పార్టీ ఎమ్మెల్యే ఎంఆర్. పల్లవి తన పసిబిడ్డతో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. నెలల వయసున్న చంటిబిడ్డను మెయిన్ హాల్ లో అక్కడే ఉన్న అటెండెంట్ కు ఇచ్చి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. అసెంబ్లీ హాల్ వద్ద రూమ్ లో కేర్ గివర్ వద్దే ఆ పసిబిడ్డ ఉండగా.. సమావేశాల అనంతరం ఎమ్మెల్యే ఎం. ఆర్ పల్లవి తన బిడ్డను తీసుకుని వెళ్లారు. అయితే ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆమెను విమర్శిస్తుండగా.. మరికొందరు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారంటూ పలువురు ఆమెకు మద్దతును ప్రకటిస్తున్నారు. మరికొందరు మాత్రం ఎమ్మెల్యే తీరును విమర్శిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు సహా అన్ని ప్రదేశాలకు ఆమె తన బిడ్డను తీసుకెళ్తూ హడావిడి సృష్టిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు.

ఈ విమర్శలపై ఎమ్మెల్యే ఎం. ఆర్ పల్లవి తాజాగా స్పందించారు. "పసిబిడ్డ కావడంతో తాను ఇంట్లో వదిలి రాలేకపోతున్నానని అన్నారు. ఒక తల్లిగా నా బాధ్యతలను, ఎమ్మెల్యేగా నా వృత్తి ధర్మాన్ని ఏకకాలంలో నిర్వర్తించడంలో ఎలాంటి తప్పు లేదు. నేను కేవలం నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను తప్ప.. ఎవరికీ ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం నాకు లేదు. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సరికాదు" అని ఎమ్మెల్యే ఎం. ఆర్ పల్లవి స్పష్టం చేశారు. మరోవైపు తమిళనాడులో సీఎం విజయ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు మూడో బిడ్డ పుడితే ఇచ్చే సెలవును 365 రోజులకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications