దసరాకు రెడీ అవుతున్న ఏపీ.. విజయవాడ ఉత్సవ్ సీజన్-2!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దసరా శరన్నవరాత్రులకు సిద్ధం అవుతుంది. మైసూర్ తరహాలో దసరా ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని భావించిన ఏపీ సర్కార్ గతే ఏడాది అత్యంత ఘనంగా దసరా ఉత్సవాలను నిర్వహించింది. మళ్ళీ ఈ ఏడాది కూడా దసరా ఉత్సవాలకు రంగం సిద్ధం చేస్తుంది. గతేడాది నిర్వహించిన దసరా ఉత్సవ్ కు ఏపీ నుండి మాత్రమే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా విశేషమైన స్పందన వచ్చింది.
ఇక దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఉత్సవ్ సీజన్-2ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని తెలిపారు. ఆదివారం నగరంలోని ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతేడాది నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ విజయవంతమైందని, దుర్గమ్మ దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఉత్సవాలను సందర్శించారని చెప్పారు.

ఈ ఏడాది అక్టోబర్ 11 నుంచి 22వ తేదీ వరకు పున్నమి ఘాట్‌తో పాటు మాకినేని బసవపున్నయ్య స్టేడియంలోనూ విజయవాడ ఉత్సవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ సుమారు లక్షన్నర మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని, వారంతా నగరంలో ఒకట్రెండు రోజులు ఆహ్లాదంగా గడిపేలా ఉత్సవాలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
ఈ నెల 28న సోమవారం అంబేద్కర్ కళావేదికలో విజయవాడ ఉత్సవ్ కర్టెన్ రైజర్ వేడుక నిర్వహించనున్నామని, దీనికి పలువురు రాష్ట్ర మంత్రులు హాజరవుతారని తెలిపారు. వైబ్రంట్స్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో, అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పర్యాటక శాఖ సహకారంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశంలోని పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని, ఏడెనిమిది మంది ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశం ఉందన్నారు.
తొలిసారిగా నగరంలో నేషనల్ సరస్ మేళాను నిర్వహించనున్నామని, ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 600 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల ప్రాతినిధ్యంతో గతంలో ఎన్నడూ జరగని స్థాయిలో సరస్ మేళాను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేశినేని చిన్ని పేర్కొన్నారు. మొత్తంగా దసరా ఉత్సవాలను ఏపీలో ప్రత్యేకంగా నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications
