చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.10 కోట్లతో ప్రభుత్వ టీచర్ పరార్
అతనో ప్రభుత్వ టీచర్.. విద్యార్థులకు రోజూ పాఠాలు బోధించేవాడు. అతనికి ఏ చెడు అలవాట్లూ లేవు.. ఊరిలో పెళ్లిళ్లు, ఆపదలు, అవసరాలకు తన దగ్గరికి వచ్చిన వారికి నమ్మకంగా డబ్బులు ఇచ్చేవాడు. దీంతో ప్రజలంతా ఆయనను నమ్మారు. ఆయనే సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఏనెగంటితండాకు చెందిన బానోత్ రాజు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆత్మకూర్ (ఎస్) మండలం శెట్టిగూడెం పాఠశాలలో SGT గా పనిచేస్తున్నాడు. అయితే సూర్యాపేటలోని విద్యానగర్ లో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ.. ఆరేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
తన సొంత తండాతో పాటు చుట్టుపక్కల 12 గ్రామాల ప్రజలు, బంధువులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వద్ద నమ్మకంగా ఉంటూ డబ్బులు కట్టించుకున్నాడు. సార్ మంచివారే కదా అని ఆయన్ను అందరూ నమ్మారు. అలా అక్రమ సంపాదనకు ఆశపడిన ఆయన పైసా పైసా కూడబెట్టుకున్న పేద రైతుల సొమ్మును పోగేసుకొని ఏకంగా రూ. 10 కోట్లు వసూలు చేశాడు. అయితే గత ఏడాది కాలంగా డబ్బులు తిరిగి చెల్లించాలని బాధితులు ఒత్తిడి చేస్తుండటంతో వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. ఇక పరార్ అయ్యేందుకు పథకం రచించాడు. తనకున్న 4 ఎకరాల భూమిలో అధిక భాగాన్ని ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించాడు.

ఇక ఇటీవల హైదరాబాద్ లో ఓ వ్యక్తిని కలవాలని చెప్పి ఇద్దరు గ్రామస్థులతో కలిసి అక్కడకు వెళ్లాడు. వారితో మాట్లాడుతూ ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత ఎంతకూ తిరిగి రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు.. సూర్యాపేట విద్యానగర్ లోని అద్దె ఇంటికి అలాగే తండాలోని అతడి ఇంటికి వెళ్లి చూడగా తాళాలు వేసి ఉన్నాయి. దాంతో బాధితులు జిల్లా ఎస్పీ నరసింహను కలిసి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఆ డబ్బును ఏం చేశాడన్న కోణంలో విచారణ చేపట్టారు. ఇక టీచర్ రాజు మోసం చేసిన వారిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, పోలీసులు, రైతులు, వివిధ వర్గాల కార్మికులు ఉన్నారు.












Click it and Unblock the Notifications
