సదస్సులో హైటెన్షన్: పొన్నం వర్సెస్ బొత్స, మైక్ కట్

పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... అమరవీరులకు కూర్చుని నివాళులు అర్పించడం వారిని అగౌరవపర్చడమే అవుతుందని.. అందరూ నిలబడి వారికి నివాళులు అర్పించాలని అన్నారు. బొత్స వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. తెలంగాణ గొంతుకు విలువ లేదని దీంతో అర్థమైందన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెసు నామినేటెడ్ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేకపోతోందనే ఆవేదన కార్యకర్తలను వేధిస్తోందన్నారు.
కాంగ్రెసులో వ్యక్తులకు తప్ప కార్యకర్తలకు ప్రాధాన్యత లేనట్లుగా కనిపిస్తోందన్నారు. సికింద్రాబాద్ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ బిసిలకు ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారని, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బిసి డిక్లరేషన్ అంటూ ముందుకెళ్తే మనం ఎందుకు మాట్లాడటం లేదన్నారు. మంత్రి ధర్మాన ప్రసాద రావుకు ఓ న్యాయం మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.
మోపిదేవి బలహీనవర్గం నేత కాబట్టే ఆయనకు న్యాయం జరగలేదా అనే భావన కార్యకర్తల్లో కలుగుతోందన్నారు. తాము తెలంగాణలో పార్టీని బతికించుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. చంద్రబాబు, షర్మిల పాదయాత్రలకు భారీ బందోబస్తు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. వారికి రక్షణ కల్పించే పనిలో మాత్రమే ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తోందన్నారు. అందరూ నిలబడి అమరవీరులకు నివాళులు అర్పించాలని పొన్నం చెప్పగా కొందరు లేచి నిలబడ్డారు.
దీనికి స్పందించిన బొత్స వారిని కూర్చోమని సూచించారు. సభకు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయని, వాటి ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని పొన్నంకు హితవు పలికారు. పొన్నం అలాగే మాట్లాడుతుండటంతో మైక్ కట్ చేయించారు. అనంతరం పొంగులేటి సుధాకర్ రెడ్డి.. పొన్నం చేతిలో నుండి మైక్ తీసుకున్నారు. దీంతో తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదిక వద్దకు దూసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ సమక్షంలోనే ఇదంతా జరిగింది. దీనిని గమనిస్తున్న ఆజాద్ వెంటనే లేచి.. తెలంగాణవాదులకు నచ్చజెప్పారు. తెలంగాణ కోసం ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అన్నారు. ఆజాద్ జోక్యంతో తెలంగాణ కోసం మృతి చెందిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సదస్సులో ప్రశాంతత ఏర్పడింది.












Click it and Unblock the Notifications