ఒక్కటి కాదు ముక్కలు!: తెలంగాణ నుండి చిరు వరకు
హైదరాబాద్: నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ మేధోమధన సదస్సులో పార్టీలోని విభేదాలు బయటపడ్డాయి! ఆదివారం ఉదయం ప్రారంభమైన సదస్సు వాడిగావేడిగా ప్రారంభమై కూల్‌గా ముగిసింది. అయితే నేతల మధ్య విభేదాలు, అధిష్టానం పైన ఉన్న అసంతృప్తి జ్వాలలు తదితరాలు మాత్రం బయటపడ్డాయి. సదస్సు ప్రారంభం కాగానే తెలంగాణ అంటూ కొందరు, చిరంజీవి ఫోటో లేదని కొందరు, దామోదర రాజనర్సింహ ఫోటో లేదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సదస్సులో ప్రధానంగా చిరంజీవి ఫోటో లేకపోవడం ఆయన అభిమానులకు, ఆయన వర్గం నేతలకు మింగుడు పడలేదు. దీంతో చిరు ఫ్యాన్స్ అలకబూని అక్కడి నుండి వెళ్లిపోయారు. ప్రభుత్వం వేసిన బుక్‌లెట్‌లో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఫోటో లేకపోవడం కూడా వేడిని రాజేసింది. ఆయన వర్గం అసంతృప్తికి లోనయ్యారు. పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు ఈ అంశాన్ని సదస్సులో ప్రధానంగా లేవనెత్తారు.

సమావేశంలో తెలంగాణ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పిన తెలంగాణ నేతలు అన్నంత పని చేశారు. నేతలు మాట్లాడుతుండగా కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ మధ్యలో మైకు తీసుకొని తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించాలని కోరారు. అందుకు బొత్స సున్నితంగా తిరస్కరిస్తూ... తెలంగాణ కోసమే కాదంటూ ఇరుప్రాంతాల వారు ఆత్మహత్య చేసుకున్నారని, అలాగే నీలం తుఫాను బాధితుల కోసమంటూ రెండు నిమిషాలు మౌనం పాటిస్తున్నట్లు ప్రకటించారు.
ఆ తర్వాత కాసేపటికి వేదిక పైకి మాట్లాడేందుకు వచ్చిన పొన్నం మాటలు సదస్సు ప్రాంగణాన్ని హీటెక్కించింది. అమరవీరులకు కూర్చుని మౌనం పాటించడమేమిటని, అది వారికి అవమానమేనంటూ మాట్లాడుతుండగా.. బొత్స ఆయన మైకును కట్ చేయించారు. సదస్సులో కొన్ని రూల్స్ ఉంటాయని పొన్నంకు హితవు పలికారు. దీంతో సదస్సు ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణవాదులు జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ వేదిక వద్దకు వచ్చారు.
పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు కూడా తీవ్రంగా స్పందించారు. తెలంగాణ నేతలు నినాదాలు చేస్తుండటంతో కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ వారిని సముదాయించారు. జగన్ కేసులో ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకట రమణల అంశాన్ని కూడా పొన్నం ప్రస్తావిండం గమనార్హం. దీంతో అది అక్కడకు చల్లారింది. దామోదర రాజనర్సింహ, కేంద్రమంత్రి చిరంజీవి మాట్లాడుతుండగా వారికి అనుకూలంగా నినాదాలు చేస్తుండటంతో వారు తమ వర్గం వారిని వారించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగాన్ని ఎమ్మార్పీఎస్ అడ్డుకునే ప్రయత్నాలు చేసింది.
మహబూబాబాద్ ఎమ్మెల్యే కవితకు చేదు అనుభవం ఎదురయింది. వేదిక వద్ద ఉన్న విఐపిల గ్యాలరీలోకి కవితను అనుమతించలేదు. భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె సమావేశం ప్రాంగణం బయట బైఠాయించారు. అంతకుముందు తెలంగాణ ప్రాంత ఎంపీలను కూడా వేదిక వద్దకు భద్రతాదళాలు రానివ్వలేదు. పాసులు లేవంటూ వారిని రానివ్వలేదు. వారు ఆందోళన చేయడంతో జానారెడ్డి స్వయంగా వచ్చి వారిని తీసుకు వెళ్లారు.
సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ వేదికపై యాదవులకు, బిసిలకు న్యాయం జరగడం లేదంటూ మాట్లాడటం చర్చకు దారి తీసింది. దేశవ్యాప్తంగా యాదవులు ఎంతోమంది ఉన్నా.. ఆ వర్గానికి కేంద్రమంత్రి వర్గంలో ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వక పోవడమేమిటని ప్రశ్నించారు. కార్యకర్తలను గుర్తించాలని, నిజమైన కార్యకర్తలకు పార్టీలో అన్యాయం జరుగుతోందని విమర్శించారు. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని వి హనుమంత రావు ముఖ్యమంత్రికి క్లాస్ పీకారు.
సదస్సుకు డుమ్మా కొట్టిన వారు
మరోవైపు సదస్సుకు కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, ఎంపీలు కావూరి సాంబశివ రావు, హర్ష కుమార్, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తదితరులు రాలేదు. జైపాల్ రెడ్డి నగరంలోనే ఉన్నప్పటికీ కిరణ్‌తో ఉన్న విభేదాల కారణంగానే రాలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాను హాజరయ్యేది లేదని కావూరి సాంబశివ రావు మొదటే చెప్పారు. మాలలు కాంగ్రెసు పార్టీకి మొదటి నుండి అండగా నిల్చుంటున్నారని, అయినా తమ వర్గాన్ని విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ హర్షకుమార్ గైర్హాజరయ్యారు.












Click it and Unblock the Notifications