పులివెందులరౌడీపై జగన్‌పార్టీ ఫైర్: బాబుపై హెచ్చార్సీకి

రాయలసీమలో ముఠాకక్షలు పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జిల్లాకో పులివెందుల రౌడీని తయారు చేశారనే వ్యాఖ్యల పట్ల శ్రీకాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశాడు. రాయలసీమను లేదా మరే ఇతర ప్రాంతాన్ని అవమానించేలా మాట్లాడితే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు.
చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసేది రికార్డుల కోసమా లేక ప్రజల కష్టాలు తెలుసుకునేందుకా అని ప్రశ్నించారు. వైయస్ రికార్డును అధిగమించామని చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. వైయస్ రికార్డు అధిగమించేందుకే యాత్ర చేపట్టారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాదయాత్రకు వైయస్ పాదయాత్రకు ఎక్కడా పోలిక లేదన్నారు. బాబు చేస్తోంది మార్నింగ్ వాకో లేక పాదయాత్రో అర్థం కాకుండా ఉందన్నారు. ఆయన యాత్రను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.
కాగా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పులివెందుల రౌడీలతో రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. జిల్లాకో పులివెందుల రౌడీని తయారు చేశారని ఆరోపించారు. తన పాలనలో అవినీతి, రౌడీయిజానికి వైయస్ పెద్ద పీట వేశారన్నారు. వరంగల్ జిల్లాలోనూ పులివెందుల రౌడీలతో హత్యా రాజకీయాలు చేశారంటూ కొండా మురళి దంపతులపై పరోక్షంగా నిప్పులు చెరిగారు.
బాబుపై హెచ్చార్సీలో ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వేర్వేరుగా ఓసి సంఘం, తెలంగాణ అడ్వోకేట్ జెఏసి హెచ్చార్సీని ఆశ్రయించింది. బాబు పులివెందుల రౌడీ అంటూ ఓ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీశారంటూ కరుణాకర్ రెడ్డి అనే అతను హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై స్పందించిన హెచ్చార్సీ మార్చి 1లోగా నివేదిక ఇవ్వాలని వరంగల్ ఎస్పీని ఆదేశించింది.
తెలంగాణవాదులపై దాడులు చేస్తున్నారని..
చంద్రబాబు తన పాదయాత్రలో తెలంగాణవాదులపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ అడ్వోకేట్ జెఏసి హెచ్చార్సీని ఆశ్రయించింది. దీనిపై జనవరి 17లోగా నివేదిక ఇవ్వాలని ఎస్పీని హెచ్చార్సీ ఆదేశించింది.












Click it and Unblock the Notifications