తెలంగాణ: అన్ని వైపుల నుంచీ చంద్రబాబుపై దాడి

చంద్రబాబు లేఖ రాయడం వల్లనే కేంద్రం తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిందని, అఖిల పక్ష సమావేశంలో తాము గతంలో లేఖ ఇచ్చామని తెలుగుదేశం పార్టీ చెప్పిందని, దీంతో తెలంగాణకు అనుకూలంగా కేంద్రం అడుగులు వేస్తోందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ తాము గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని చెప్పడం వల్ల రాష్ట్రానికి చెందిన మెజారిటీ శానససభ్యులు విభజనకు అనుకూలంగా ఉన్నారనే అపోహకు కేంద్ర ప్రభుత్వం గురైందని లగడపాటి రాజగోపాల్ అన్నారు.
తెలుగుదేశం పార్టీలోని పలువురు సీమాంధ్ర నాయకులు చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నారు. అవసరమైతే ధిక్కరించడానికి కూడా వారు సిద్ధమైనట్లు అర్థమవుతోంది. రాయలసీమకు చెందిన పయ్యావుల కేశవ్, ఉత్తరాంధ్రకు చెందిన తమ్మినేని సీతారాం, గుంటూరు జిల్లాకు చెందిన నన్నపనేని రాజకుమారి వంటి నాయకులు చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా శనివారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు. తెలంగాణలో పాదయాత్ర కోసం సమైక్యవాదాన్ని చంద్రబాబు నీరు గార్చారని ఆయన విమర్శించారు. తాను పార్టీకి రాజీనామా చేస్తానని కూడా అన్నారు. హైదరాబాదుకు చెందిన సుధీష్ రాంభొట్ట డొంక తిరుగుడుగా చంద్రబాబును ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధపడ్డారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూనే హైదరాబాదు ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. రాయలసీమకు చెందిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబునే తప్పు పట్టారు.
హైదరాబాద్‌కు చెందిన అరవింద్ కుమార్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు కూడా చంద్రబాబునే తప్పు పడుతుండడం చంద్రబాబుకు ఇబ్బందిగానే ఉంది. ఇదే సమయంలో విశాఖపట్నం పార్టీలో నెలకొన్న సంక్షోభం కూడా చంద్రబాబు తలకు చుట్టుకుంది. అయితే, యనమల రామకృష్ణుడు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు సీమాంధ్ర నాయకులు చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారు.












Click it and Unblock the Notifications