హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ: బాబుదే పైచేయి, కాంగ్రెసు ఉక్కిరి బిక్కిరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ అంశంపై ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు మీద పైచేయి సాధించినట్లే కనిపిస్తున్నారు. తెలంగాణపై తాము గతంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చామని, తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెసు పార్టీదే అని చెప్పడం ద్వారా తాము తెలంగాణకు అనుకూలమనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ చెప్పింది. దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత తగ్గగా, సీమాంధ్ర ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురు కావడం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీకి తెలంగాణ సమస్య నుంచి ఊరట లభించినట్లే అని చెప్పవచ్చు.

చంద్రబాబు తెలంగాణ సానుకూల వైఖరి వల్ల తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులు పెద్ద యెత్తున తిరుగుబాటు చేస్తారనే కాంగ్రెసు అంచనాలు తారుమారయ్యాయి. పయ్యావుల కేశవ్, తమ్మినేని సీతారాం, వేణుగోపాల్ రెడ్డి వంటి కొద్ది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే వ్యతిరేకత ప్రదర్శించారు. అంతకు మించి ఎక్కువ ముందుకు దూకడం లేదు. ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని సీమాంధ్రకు చెందిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పదే పదే చెబుతున్నారు. ఆ రకంగా తాము తెలంగాణకు అనుకూలమనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పకనే చెబుతున్నారు.

చంద్రబాబు తెలంగాణ అనుకూల వైఖరితో సీమాంధ్ర నాయకులు కొంత మంది నిరసన వ్యక్తం చేసినప్పటికీ రాజీనామాలు చేయడం, పార్టీకి దూరం కావడం వంటి తీవ్ర చర్యలకు పూనుకోవడం లేదు. దాదాపుగా మౌనం వహించారు. ఈ స్థితిలో కాంగ్రెసు చిచ్చు రేగింది. సీమాంధ్ర, తెలంగాణ నేతలు నిట్టనిలువునా చీలిపోయి, పార్టీ అధిష్టానం పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్ర విభజనకు వాతావరణం చంద్రబాబు వల్లనే అనుకూలంగా మారిందనే విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అంటున్నా ఫలితం కనిపించడం లేదు.

ఇంతకాలం తెలంగాణ విషయంలో చంద్రబాబు వైఖరిని తప్పు పడుతూ వచ్చిన కాంగ్రెసు నేతలకు ఏం చేయాలో కూడా దిక్కు తోచని స్థితి ఏర్పడింది. తమలో తామే కలహించుకోవాల్సిన స్థితిలోకి వెళ్లిపోయారు. తెలంగాణ చిక్కు ముడి నుంచి చంద్రబాబు బయటపడగా కాంగ్రెసు ఉక్కిరి బిక్కిరి అవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తాము చేసేదేమీ లేదని, తాము ఇవ్వాలంటే ఇవ్వడమో - లేదంటే మానడమో కాంగ్రెసు పార్టీ చేయదని, అందువల్ల పార్టీలో ప్రాంతాలవారీగా చీలిపోవడం తగదని చంద్రబాబు ఇరు ప్రాంతాల పార్టీ నాయకులకు చెప్పిన మంత్రం పనిచేసినట్లే కనిపిస్తోంది. మొత్తం మీద, తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన భారమంతా కాంగ్రెసు అధిష్టానంపై పడింది.

English summary
According to political analysts - Telugudesam party (TDP) president N Chandrababu has succeeded to take upper hand on Congress party on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X