తెలంగాణపై చర్చకే: బొత్స, ఏదైనా సమ్మతిస్తా: చిరు

వాస్తవ పరిస్థితులు చెప్పానని, గడువు తన పరిధిలోది కాదని ఆయన అన్నారు. సమస్యకు పరిష్కారం కావాలని కోరానని, సత్వరమే తెలంగాణ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆయన ఆశించారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పిసిసి, సిఎల్పీ నేతల సమావేశం ఏర్పాటు చేశారని, ఈ సందర్భంగా ఢిల్లీ వచ్చినప్పుడు కూడా అధిష్టానం పెద్దలతో మరిన్ని చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు.
తెలంగాణపై సంప్రదింపులు ఎంత కాలం కొనసాగుతాయో చెప్పలేనని ఆయన అన్నారు. చర్చల కోసం మరింత మంది రాష్ట్ర కాంగ్రెసు నాయకులను అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇప్పటికే రెండు రోజుల పాటు పార్టీ అధిష్టానం పెద్దలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఆయనతో కూడా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై తాను ఎటువంటి నివేదికలు కూడా ఇవ్వలేదని గవర్నర్ ఆదివారం చెప్పారు.
ఇదిలావుంటే, తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం ఏలాంటి నిర్ణయం తీసుకున్నా సమ్మతిస్తానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. అయితే, తెలంగాణపై మాత్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని తాను కోరినట్లు ఆయన తెలిపారు. 2014లో కాంగ్రెసు విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. ఆయన సోమవారం బొత్స సత్యనారాయణను కలిశారు.
2014 ఎన్నికల్లో ఏ విధమైన సెంటిమెంట్లు ఉండవని ఆయన అన్నారు. రైతులంతా కాంగ్రెసు వైపే ఉన్నారని సహకార సంఘాల ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని ఆయన అన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఓట్లు చీల్చుకుంటే తాము లాభపడుతామని తెలుగుదేశం భావించిందని, తమ ప్రభంజనం మాత్రమే ఉందని వైయస్సార్ కాంగ్రెసు చెబుతూ వచ్చిందని, కానీ కాంగ్రెసు పటిష్టంగా ఉందని సహకార ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని చిరంజీవి అన్నారు.
తిరుపతిలో అర్బన్ బ్యాంక్ సీట్లు 12 ఉంటే తమ కాంగ్రెసు పార్టీ ఆరు స్థానాలు గెలుచుకుందని, దీన్ని బట్టి కాంగ్రెసు పటిష్టంగా ఉందని చెప్పవచ్చునని ఆయన అన్నారు. తిరుపతి తన నియోజకవర్గం కాబట్టి తాను దాన్ని ఉదాహరణగా తీసుకున్నానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications