పట్టువదలని విక్రమార్కుడు: కొనసా..గనున్నపాదయాత్ర

చంద్రబాబు తొలుత పాదయాత్ర ప్రారంభించినప్పుడు జనవరి 26న ముగించాలని భావించారు. అయితే, ఆ తర్వాత దానిని పొడిగించారు. మే నెల వరకు పాదయాత్ర చేయాలనే భావనతో చంద్రబాబు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ నెల 22వ తేదీ నాటికి గుంటూరు జిల్లాలో యాత్ర పూర్తి కావాల్సి ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా 19వ తేదీ సాయంత్రం నుంచి 21వ తేదీ సాయంత్రం వరకూ యాత్రకు విరామం ఇవ్వాల్సి వస్తోంది.
దీంతో గుంటూరు జిల్లాలో ఆయన రెండు రోజులు అదనంగా ఉంటున్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో రెండో దఫా అడుగు పెడతారు. ఈ విడతలో సుమారు పది రోజులు అక్కడ పాదయాత్ర చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగు పెడతారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటన కనీసం పాతిక రోజులు ఉంటుంది. ఏప్రిల్ ఐదో తేదీ నాటికి ఈ జిల్లాలను పూర్తి చేసుకొని ఉత్తరాంధ్రలో అడుగు పెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఒక్కో జిల్లాకు పది రోజులు వేసుకొన్నా మూడు జిల్లాలు పూర్తి కావడానికి నెల పడుతుందని, ఈ లెక్కన మే నెల మొదటి వారానికిగాని యాత్ర పూర్తి కాదని అంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మూడు రోజులు పాదయాత్రకు బ్రేక్ పడింది. ఇలా మరిన్ని బ్రేకులు వస్తే మరింత పొడిగింపునకు కూడా ఆస్కారం ఉండే అవకాశాలు ఉన్నాయి. పాదయాత్ర పొడిగింపు దృష్ట్యా బాబు బడ్జెట్ సమావేశాలకు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇటీవల జరిగిన సమావేశాలకు బాబు హాజరు కాని విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications