చరిత్ర: 18 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

విప్‌ను ధిక్కరించారని ఆరోపిస్తూ కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) చేసిన ఫిర్యాదు మేరకు కాంగ్రెసుకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుజయ కృష్ణరంగారావు, ఆళ్ల నాని, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, జోగి రమేష్, మద్దాల రాజేష్, శివప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, పేర్ని నానీలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వీరంతా వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారు. ప్రభుత్వంపై శాసనసభలో ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేశారు.
విప్‌ను ధక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన తమ పార్టీకి చెందిన 9 మంది శానససభ్యులపై తెలుగుదేశం శానససభా పక్షం (టిడిఎల్పీ) ఫిర్యాదు చేసింది. అవిశ్వాస తీర్మానంపై తటస్థంగా ఉండాలంటూ టిడిఎల్పీ తన సభ్యులకు విప్ జారీ చేసింది. అయితే, వారంతా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచారు.
విప్ ఉల్లంఘించారంటూ టిడిఎల్పీ స్పీకర్‌కు సమర్పించిన జాబితాలో తెలుగుదేశం శాసనసభ్యులు శిరియా సాయిరాజ్(ఇచ్ఛాపురం), తానేటి వనిత (గోపాలపురం), కొడాలి నాని (గుడివాడ), చిన్నం రామకోటయ్య (నూజివీడు), అమర్నాథ్ రెడ్డి (పలమనేరు), ప్రవీణ్ కుమార్ రెడ్డి (తంబళ్లపల్లి), బాలనాగి రెడ్డి (మంత్రాలయం), హరీశ్వర్ రెడ్డి (పరిగి), వేణు గోపాలాచారి (ముధోల్)లు ఉన్నారు.
హరీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరడానికి సిద్ధపడగా, వేణుగోపాలాచారి నాగం జనార్దన్ రెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ నగారా సమితిలో ఉన్నారు. మిగతా ఏడుగురు శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు.












Click it and Unblock the Notifications