జగన్, చంద్రబాబు, కెసిఆర్: ఎవరు ఎవరితో కలిసేనో?

Chandrababu Naidu - YS Jagan - K Chandrasekhar Rao
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కొత్త పొత్తులు కనిపించనున్నాయి. ఎవరు ఎవరితో వెళ్తారనే అంశంపై స్పష్టత లేకపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, అధికార కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెరాస, బిజెపి, సిపిఐ, సిపిఎం, మజ్లిస్ పార్టీల వైఖరులను బట్టి ఎవరు ఎవరితో వెళ్లనున్నారనే విషయంపై ఓ అంచనాకు వస్తున్నారు. ఎన్నికలకు ఏడాది గడువు ఉన్న నేపథ్యంలో కొత్త పొత్తులకు పావులు కదులుతున్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల ముందు వామపక్షాలు, తెరాసలతో కలిసి మహా కూటమి ఏర్పాటు చేసి పోటీ చేసిన టిడిపి ఈసారి కొత్త కూటమిని రూపు దిద్దే ప్రయత్నాల్లో ఉంది. కూటమి ఏర్పాటుపై ఇప్పుడే స్పష్టత రాకపోయినా ఈ దిశగా పావులు మాత్రం కదులుతున్నాయి. మహా కూటమి పార్టీల్లో తెరాస, టీడీపీ మధ్య సంబంధాలు పూర్తిగా తెగతెంపులయ్యాయి. పోలింగ్ ముగిసిన వెంటనే తెరాస మహా కూటమికి స్వస్తి చెప్పి ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపింది.

ఆ తర్వాత ఈ రెండు పార్టీల మధ్య వైరం తీవ్రమైంది. ఇక, రెండు వామపక్ష పార్టీల్లో సిపిఐ టిడిపితో మిత్రత్వ వైఖరినే కొనసాగిస్తోంది. తాము టిడిపితో కలిసే పోటీ చేస్తామని ఆంతరంగిక సంభాషణల్లో సిపిఐ నేతలు చెబుతున్నారు. తెలంగాణ వరకూ తెరాసతో పొత్తు పెట్టుకొంటే బాగుంటుందని ఆ పార్టీలో కొందరు నేతలు ప్రతిపాదిస్తున్నా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకోవడం సాధ్యం కాదని, పైగా తెలంగాణలో పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్న ఖమ్మం జిల్లాలో తెరాస ప్రభావం తక్కువగా ఉండడం కూడా ఆ ప్రతిపాదనను బలహీనపరుస్తోందని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇంకోవైపు రెండు రోజుల క్రితం కెసిఆర్ ఏ పార్టీతో పొత్తులుండవని చెప్పారు.

తన భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని సిపిఎం గుంభనంగా ఉంచుతోంది. మహా కూటమితో తమకు భారీ నష్టం జరిగిందని, మిగిలిన పార్టీలు తమను మోసం చేశాయని, అందుకే తాము ఒక సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని సిపిఎం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏదో పార్టీతో పొత్తు పెట్టుకొనే బదులు ఒంటరిగా పోటీ చేయడం మేలన్నది ఆ పార్టీ ముఖ్యుల వాదన. జగన్‌తో వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

పొత్తు లేకుండా ఎక్కువ సీట్లు సాధించడం కష్టమేనని భావిస్తూనే మరోవైపు అవినీతి ముద్ర పడిన జగన్ పార్టీతో పొత్తుపై పార్టీలోని కొందరు నేతలు ఆలోచిస్తున్నారట. టిడిపితో వెళ్లే అవకాశాలు కూడా కొట్టిపారేయలేమంటున్నారు. గతంలో టిడిపికివ్యతిరేకంగా పోటీ చేసిన లోక్‌సత్తా పార్టీ ఈసారి టిడిపితో జత కట్టవచ్చన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో గత ఎన్నికల్లో లోక్‌సత్తా చీల్చుకొన్న ఓట్లు కనీసం డజను నియోజక వర్గాల్లో టిడిపి కొంప ముంచాయి. కొంతకాలంగా లోక్‌సత్తా నేతలు టిడిపి పట్ల మృదు వైఖరితో వ్యవహరిస్తున్నారట.

మజ్లిస్ వైఖరి పట్ల కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకొన్న ఈ పార్టీ తర్వాత జగన్ పార్టీకి సన్నిహితంగా వ్యవహరించింది. కానీ, ఇటీవల ఆ పార్టీ నేతలు టిడిపి పట్ల కూడా తటస్థంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి కాలంలో టిడిపి నేతలు రెండు మూడుసార్లు ఒవైసీ సోదరులను కలిసి మాట్లాడారు. పరస్పరం అభిప్రాయాలను పంచుకోవడం వరకే వారి చర్చలు పరిమితమైనా కొంత వరకు మజ్లిస్ తలుపులు తీసి ఉంచుతోందన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి.

అంతేకాకుండా టిడిపిలోని కొందరు నేతలు ఇటీవలి కాలంలో బిజెపితో సంబంధాలు పునరుద్ధరించుకోవడంపైనా మాట్లాడుతున్నారట. నరేంద్ర మోడీ రంగంలోకి వచ్చిన తర్వాత బిజెపి పరిస్థితి కొంత మెరుగైనట్లు కనిపిస్తోందని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకొంటే లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని వారంటున్నారు. అయితే, ప్రస్తుతానికి టిడిపి అధినాయకత్వం ఆ యోచనలో లేదట. రాష్ట్రంలో గణనీయంగా ఉన్న మైనారిటీలు ఇప్పుడిప్పుడే టిడిపికి కొద్దిగా దగ్గర అవుతున్నారని, ఈ సమయంలో వారిని దూరం చేసుకోవడానికి టిడిపి ముఖ్యులకు ఇష్టం లేదంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+