పాకిస్థాన్ వీధుల్లో బిచ్చగాడిలా తిరుగుతూ.. అణు రహస్యాలను బయట పెట్టిన అజిత్ దోబాల్..
భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోవడంతో పాకిస్థాన్ పై భారత్ 'ఆపరేషన్ సింధూర్' చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాదిమంది ఉగ్రమూకలను హతమార్చింది. మరోవైపు తాజాగా భారత జాతీయ సలహాదారు అజిత్ దోబాల్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ అవార్డు అందించింది. ఈ క్రమంలో అజిత్ దోబాల్ సేవలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు.
అజిత్ దోబాల్ కు లోకమాన్య తిలక్ అవార్డు వరించిన నేపథ్యంలో ఆయన గత విశేషాలు, గతంలో సాధించిన విజయాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్ లో న్యూక్లియర్ పరీక్షలకు సంబంధించిన రహస్యాలను కనుగొనేందుకు అజిత్ దోబాల్ తన ప్రాణాలకు తెగించి పెద్ద సాహసమే చేశారు. భారత్ తొలిసారిగా 1974 లో న్యూక్లియర్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. అయితే ఈ విజయాన్ని జీర్ణించుకోలేని పాకిస్థాన్.. తాను కూడా అణు పరీక్షలను నిర్వహించాలని ఆలోచన చేసింది. అందుకు చైనా సాయం తీసుకుంది.
అయితే పాకిస్థాన్ రహస్యంగా చేపట్టిన అణు పరీక్షలకు సంబంధించిన రహస్యాలను ఛేదించాలని భారత్ ఎవరికీ తెలియకుండా ఓ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ బాధ్యతలను అప్పటి ఇంటెలిజెన్స్ అధికారి అజిత్ దోబాల్ కు అప్పగించింది. దాంతో అజిత్ దోబాల్ తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ పెద్ద సాహసమే చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు డి. దేవదత్తు రాసిన "అజిత్ దోబాల్: ఆన్ ఏ మిషన్" అనే పుస్తకంలో ఉన్నాయి. ఈ బుక్ లో ఉన్న వివరాల ప్రకారం అజిత్ దోబాల్ ఓ బిచ్చగాడిలా పాకిస్థాన్ లోకి అడుగుపెట్టారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరేళ్లపాటు ఆయన పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ వీధుల్లో తిరిగారు. మాసిన గెడ్డం, చిరిగిన బట్టలు, దుప్పటితో ఎవరికీ అనుమానం రాకుండా అలా ఆరేళ్లపాటు గడిపారు. కహుతా అనే ప్రాంతంలో ఉన్న ది ఖాన్ రీసెర్చ్ లాబొరేటరీస్(KRL) పరిసర ప్రాంతాల్లో గడిపారు. ఈ ల్యాబ్ లోనే పాకిస్థాన్ న్యూక్లియర్ పరీక్షలను నిర్వహించారు. నిత్యం శాస్త్రవేత్తలు తిరుగుతూ అత్యంత పటిష్ట భద్రత మధ్య ఉండే ఈ ప్రాంతంలో అజిత్ దోబాల్ బిచ్చగాడిలా తిరుగుతూ ఆ దేశ అణు రహస్యాలను ఎప్పటికప్పుడు భారత్ కు చేరవేస్తూ వచ్చారు.
అయితే ఈ సీక్రెట్ ఆపరేషన్ లో నిజమైన బ్రేక్ థ్రూ ఓ సెలూన్ షాపులో లభ్యమైన వెంట్రుకల ద్వారా దొరికింది. ల్యాబ్ కు సమీపంలోనే ఉన్న ఈ సెలూన్ లోనే నిత్యం శాస్ర్తవేత్తలు, అధికారులు కటింగ్, క్షవరం చేయించుకునేవారు. అయితే వాళ్ల వెంట్రుకలు అక్కడే పడి ఉండేవి. వాటిని సీక్రెట్ గా అజిత్ దోబాల్ కలెక్ట్ చేసి భారత్ కు పంపించారు.

ఆ వెంట్రుకలను ఇక్కడి ల్యాబ్ లో పరీక్ష చేయగా వాటిపై యూరేనియం, రేడియేషన్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన భారత్ తన జాతీయ భద్రతా వ్యూహాన్ని మార్చుకుంది. అలా అజిత్ దోబాల్ కారణంగానే పాకిస్థాన్ అణు పరీక్షలు దాదాపు 15 ఏళ్లు లేట్ అయ్యాయి. తాజాగా అజిత్ దోబాల్ కు లోకమాన్య తిలక్ అవార్డు వరించిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.














Click it and Unblock the Notifications