SpaceX Crew-13: నాసా స్పేస్ ఎక్స్ క్రూ-13 ప్రయోగం సక్సెస్.. ISS లోకి నలుగురు వ్యోమగాములు.. 6 నెలలు అక్కడే
అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, స్పేస్ ఎస్ సంయుక్తంగా చేపట్టిన క్రూ- 13 ప్రయోగం విజయవంతం అయింది. ఈ మిషన్ లో భాగంగా మొత్తం నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు పంపించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, భీకర గాలులు ఉన్నప్పటికీ నాసా- స్పేస్ ఎక్స్ ఈ మిషన్ ను విజయవంతంగా పూర్తి చేశాయి. కేప్ కానవెర్సల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ది ఫాల్కన్ 9 రాకెట్ ఈ ప్రయోగాన్ని పూర్తి చేసింది. ఈ మిషన్ లో భాగంగా బృందంలోని నలుగురు దాదాపు ఆరు నెలలపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే గడిపి వివిధ పరిశోధనలు నిర్వహించి తిరిగి భూమి మీదకు చేరుకోనున్నారు. ఇక ఈ బృందంలో నాసా నుంచి ఇద్దరు వ్యోమగాములు జెస్సికా వాట్కిన్స్, ల్యూక్ డెలానీ ఉన్నారు. అలాగే కెనడా స్పేస్ ఏజెన్సీకు చెందిన జాషువా కుట్రిక్, రష్యా స్పేస్ ఏజెన్సీకు చెందిన సెర్గీ టెటెరియాట్నికోవ్ ఉన్నారు.
నాసాకు చెందిన వ్యోమగామి జెస్సికా వాట్కిన్స్, జియాలజిస్ట్ కు ఇది రెండో అంతరిక్షయాత్ర కావడం విశేషం. ఆమె 2022 లో క్రూ-4 మిషన్ ద్వారా మొత్తం 170 రోజులపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపారు. ఇక పైలట్ ల్యూక్ డెలానీకు ఇది తొలి స్పేస్ యాత్ర. ఇక మిగతా ఇద్దరు వ్యోమగాములు మిషన్ స్పెషలిస్టులుగా పనిచేయనున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత ఈ బృందం ఎక్స్‌పెడిషన్-75 మిషన్‌లో భాగం కానుంది.

సైంటిఫిక్ పరిశోధనలు నిర్వహించనుంది. క్రూ సిబ్బందిపైనా ఈ ప్రయోగాలు నిర్వహించనున్నారు. పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సకు సంబంధించి పరిశోధనలను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి బృందం పనిచేయనుంది. అలాగే దీర్ఘకాలిక మిషన్ లకు సిద్ధమయ్యేందుకు అంతరిక్షంలోనే పంటల ఉత్పత్తిని పరిశీలించనున్నారు. అలాగే అంతరిక్షంలో కొత్త వైద్య పరికరాలపైనా ఎక్స్ పెరిమెంట్స్ చేయనున్నారు. ఇక భవిష్యత్తులో చేపట్టబోయే చంద్రుడు, అంగారకుడి యాత్రలకు ఈ బృందం పరిశోధనలు ఉపయోగపడనుండగా.. మరికొన్ని పరిశోధనలు భూమిపై మానవ జీవితాన్ని మెరుగుపరచడంలో సహాయపడనున్నాయి. ఇక క్రూ-13 బృందం రాకతో గతంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన క్రూ-12 బృందం తిరిగి భూమి మీదకు చేరుకోనుంది. క్రూ-12 బృందం వచ్చేవారం భూమిపైకి రానున్నారు.












Click it and Unblock the Notifications
