అప్పటిదాకా ఖైరతాబాద్ ఉప ఎన్నిక లేదు.. ఈసీఐ కీలక నిర్ణయం
ప్రస్తుతం తెలంగాణలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ అనర్హతకు గురైన నేపథ్యంలో ఆ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయింది. ఈ క్రమంలో ఖైరతాబాద్ ఎలక్షన్ షెడ్యూల్ ను భారత ఎన్నికల కమిషన్ ప్రకటించాల్సి ఉంది. అయితే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేయాలంటూ దివంగత నేత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇంకా హైకోర్టు తుది తీర్పు వెల్లడించకముందే భారత ఎన్నికల సంఘం తెలంగాణ హైకోర్టుకు కీలక విషయాన్ని తెలిపింది. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ పై తుది పరిష్కారం వచ్చేంత వరకూ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి బై పోల్ నోటిఫికేషన్ జారీ చేయబోమని ఈసీఐ స్పష్టం చేసింది. దీంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహణ ప్రక్రియపై విచారణ తేలేంత వరకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు అయింది.
ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో దానం నాగేందర్ ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని.. ఈ మేరకు ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలంటూ 2024 జనవరిలోనే విజయారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ సింగిల్ బెంచ్ జడ్జి వద్ద పెండింగ్ లో ఉందని విజయారెడ్డి తరఫు న్యాయవాది సీజే ధర్మాసనం దృష్టికి తాజాగా తీసుకెళ్లారు. ఈ క్రమంలో దానిపై తుది తీర్పు వచ్చేదాకా ఖైరతాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వకూడదని ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుని కోరారు. ఈలోపు ఎన్నికల సంఘమే స్పందిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పిటిషన్ పై తుది తీర్పు వచ్చేదాకా ఖైరతాబాద్ ఉప ఎన్నిక నోటిపికేషన్ జారీ చేయమని హైకోర్టుకు ఈసీ తెలిపింది. ఇక దానం నాగేందర్ అనర్హతకు గురికావడంతో ప్రస్తుతం ఖైరతాబాద్ స్థానం ఖాళీగానే ఉంది.

ఇదిలాఉంటే దిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట దానం నాగేందర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడిందని ఆయన ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తే మరోసారి ఓడిపోవడం తథ్యమంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ టికెట్ సీఏ వేణుగోపాల్ స్వామికి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
