బాబుకే ఛాన్స్, జగన్ వస్తాడో రాడో తెలియదు: బాలకృష్ణ

విశాఖలో చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా బాలయ్య మాట్లాడారు. బాబు విశ్వసనీయత గురించి కొందరు మాట్లాడుతున్నారని, విశ్వసనీయత అంటే నమ్మినవారిని జైలుకు పంపడమేనా? అని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పనిచేసిన మంత్రులు, ఐఏఎస్ అధికారులను ఇప్పుడు జైలుకు పంపారని, అలాంటి విశ్వసనీయత తమకవసరం లేదని ఎద్దేవా చేశారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఉద్ఘాటించారు.
ఏదైనా ఉన్నత శిఖరం చేరాలంటే సత్సంకల్పం ఉండాలని స్వర్గీయ నందమూరి తారక రామారావు చెప్పేవారని, ఆ సద్గుణాలన్నీ చంద్రబాబులో ఉన్నాయన్నారు. తప్పుచేసిన వారిపట్ల ఎన్టీఆర్ చండశాసనుడిలా వ్యవహరించారని, బడుగుబలహీన వర్గాలకు జస్టిస్ చౌదరిలా న్యాయం చేశారని, సంఘ సంస్కరణలకు బొబ్బిలి పులిలా పనిచేశారని వ్యాఖ్యానించారు. పార్టీ అనేకసార్లు క్లిష్టపరిస్థితుల్లో చిక్కుకుంటే చంద్రబాబు రక్షించుకుంటూ వచ్చారన్నారు.
ఆయన పాలనాదక్షుడన్నారు. దురదృష్టం కొద్దీ రాష్ట్రంలో రెండుసార్లు తెలుగుదేశం పార్టీ ఓడిపోతే.. కాంగ్రెస్ నాయకులు అధికారం చేపట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. విద్యుత్ ఇవ్వలేక ఆంధ్రప్రదేశ్‌ను అంధకారప్రదేశ్‌గా మార్చేశారన్నారు. రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరినా ప్రజలకు ఏమీ మేలు జరగడం లేదన్నారు. బాబును అంతా డిక్టేటర్ అంటూ విమర్శిస్తున్నారని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ఆ డైనమిజమ్ తప్పకుండా ఉండాలన్నారు.
జైలు నుంచి బయటకు వస్తాడో రాడో తెలియని జగన్ అధికారంలోకి వస్తాడని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికిపూర్వవైభవం తీసుకురావాలంటే బాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications